Earthquake Hits Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉత్తర ఫిలిప్పీన్స్ ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. రాజధాని మనీలాకు 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం ధాటికి రాజధానిలోని ఎత్తైన భవనాలు కుదుపులకు లోనైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. బుధవారం ఉదయం 8.43 గంటలకు అబ్రా ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది. భూకంపం రావడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ప్రభావానికి కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటివరకు ప్రాణనష్టం వివరాలు నమోదు కానప్పటికీ.. ప్రజలు మాత్రం పెద్ద సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది.
ఫిలిప్పీన్స్ దేశం రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలువబడే ప్రాంతంలో ఉంది. ఇక్కడ టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉండటంతో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. జపాన్ నుంచి ఆగ్నేయాసియా దేశాల వరకు పసిఫిక్ మహాసముద్రంలో ఆర్క్ లా ఉంటే ప్రాంతాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ గా వ్యవహరిస్తుంటారు. బుధవారం ఫిలిప్పీన్స్ లో వచ్చిన భూకంపం, ఈ ఏడాదిలో అత్యంత శక్తివంతమైనది. 2013 అక్టోబర్ లో ఫిలిప్పీన్స్ లోని బోహోల్ ద్వీపంలో 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 200 మందికి పైగా మరణించారు. అంతకుముందు 1990లో వచ్చిన భూకంపంలో దాదాపుగా 1200 మంది మరణించారు. చాలా మంది నిరాశ్రయులు అయ్యారు.
Read Also: Tiger Deaths: మూడేళ్లలో భారీగా పులుల మరణాలు..పులుల దాడిలో ఎంత మంది మరణించారంటే..
ఇదిలా ఉంటే బుధవారం రోజు ఆప్ఘనిస్తాన్ లో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్ ఫైజాబాద్ పట్టణానికి 89 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. తెల్లవారుజామున 2.07 గంటలకు సంభవించిన భూకంపంలో పెద్దగా ఆస్తి, ప్రాణనష్టం జరలేదని తెలుస్తోంది. ఈ భూకంపం ప్రకంపనలు పొరుగు దేశాలకు కూడా విస్తరించాయి. పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.