మందు తాగటం మంచి అలవాటు కాదంటారు. కానీ 40 ఏళ్ల వయసు దాటినవారు స్వల్పంగా ఆల్కహాల్ తీసుకోవటం ఆరోగ్యానికి లాభిస్తుందని లాన్సెట్ స్టడీ తెలిపింది. రెడ్ వైన్‌ని రెండు, మూడు పెగ్గులేస్తే గుండె జబ్బులు, గుండెపోటు, షుగర్ లెవల్స్ వంటి హెల్త్ రిస్కులు తగ్గుతాయని పేర్కొంది. 39 ఏళ్ల లోపువారు మందుకొడితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనమూ ఉండదని, పైగా అనారోగ్యానికి గురవుతారని హెచ్చరించింది. మన దేశంలో గత 30 ఏళ్లలో ఆల్కహాల్ వినియోగం కొంచెం పెరిగినట్లు వెల్లడించింది.
దేశంలో దాదాపు 54 లక్షల మంది (15-39 ఏజ్ గ్రూప్) మహిళలకు ఈ అలవాటు ఉందని పేర్కొంది. 1990లతో పోల్చితే ఇప్పుడు 0.08 శాతం పెరిగినట్లు విశ్లేషించింది. 40-64 ఏజ్ గ్రూప్ ఆడవాళ్లలో ఈ హ్యాబిట్ 0.15 శాతం పెరిగింది. 65 ఏళ్లు పైబడ్డ మహిళలు మందు తాగటం తగ్గించారని లాన్సెట్ మెటా అనాలసిస్ స్పష్టం చేసింది. మగవాళ్ల విషయానికొస్తే అన్ని వయసులవారిలోనూ డ్రింకింగ్ అలవాటు పెరిగింది. దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది పురుషులు పూటుగా తాగుతున్నారు.
40-64 ఏజ్ గ్రూపులో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ వయసువాళ్లల్లో 5.63 శాతం, 15-39 ఏజ్ గ్రూప్‌లో 5.24 శాతం మద్యం అలవాటు పెరగ్గా 65 ఏళ్లు పైబడ్డవారిలో 2.88 శాతం పెరిగింది. ఆసియా ఖండంలోని ఇతర దేశాల సంగతి పరిశీలిస్తే.. పాకిస్థాన్‌లోనూ ఇండియా మాదిరిగానే ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరూ తాగుబోతులే. నేపాల్‌లో మగవాళ్లు ఎక్కువగా, ఆడవాళ్లు తక్కువగా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్, భూటాన్‌లో ఆడ, మగ ఇద్దరూ తక్కువ సంఖ్యలోనే డ్రింకేస్తున్నారు.
ఇండియా, పాకిస్థాన్‌లలో మద్యం వాడకం పెరగటానికి పట్టణీకరణే ప్రధాన కారణమని తేలింది. అర్బనైజేషన్ వల్ల ఆదాయం పెరిగి పబ్లిక్ లైఫ్ స్టైల్ మారిపోతోందని అభిప్రాయపడింది. రెండేళ్ల కిందట ఏకంగా 59.1 శాతం మంది జనాలు (ఇందులో 76.7 శాతం మంది పురుషులు) అధిక మోతాదులో మద్యం సేవించినట్లు లాన్సెట్ వెల్లడించింది. అందువల్ల చిన్న వయసులోనే మద్యానికి బానిసవుతున్నవారి సంఖ్యను తగ్గించటానికి కఠిన నిబంధనలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.