Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ దాడులు నిర్వహించింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ఆయన నివాసంపై సోదాలు జరిపింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తన ఇంట్లోకి అధికారులు బలవంతంగా చొరబడ్డారని, ఇలాంటి దాడులు వెనకబడిన దేశాల్లోనే జరుగుతాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు సుదీర్ఘ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్రంప్.. తన ఇంటిని పూర్తిగా నిర్బంధించారని చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ రహస్య పత్రాలను ఇక్కడికి తరలించారేమో అనే అనుమానంతో సోదాలు చేశారు. అయితే.. వీటిని అధికారులు ధ్రువీకరించలేదు కానీ.. ట్రంప్ , ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఇప్పటికే పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ట్రంప్ 2020లో జార్జియా రాష్ట్రంలో ఓటింగ్ ఫలితాలను మార్చడానికి చేసిన ప్రయత్నాలపై, పలు కుంభకోణాలపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎఫ్‌బీఐ సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తనను అడ్డుకునేందుకు డెమొక్రాట్లు ఇలా చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ‘న్యాయవ్యవస్థను ఆయుధంలా మార్చుకుంటున్నారు. డెమొక్రాట్లు నన్ను అధ్యక్ష పదవికి పోటీ పడకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి పోల్స్ చూసి ఎలాగైనా రిపబ్లికన్లను నియంత్రించాలని అనుకుంటున్నారు. రాజకీయ. కక్ష సాధించడానికే ఈ దాడులు జరిగాయి. అయినా అమెరికా ప్రజల కోసం సేవ చేస్తూనే ఉంటా.’ అని ట్రంప్ పేర్కొన్నారు.
Assam Rifles: అస్సాం రైఫిల్స్ శిబిరాలపై ఉగ్రదాడులు
ఇవి అమెరికా దేశానికి చీకటి రోజులని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. తన అందమైన ఇంటిని నిర్బంధించి, సోదాలు చేసి ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ అధ్యక్షుడి విషయంలో ఇలాంటి దాడులు జరగలేదన్నారు. తన ఇంటిపై అప్రకటిత సోదాలు అనవసరం, అనుచితమంటూ వ్యాఖ్యలు చేశారు. తన లాకర్లను సైతం పగులగొట్టారని వెల్లడించారు. వాటర్‌గేట్ ఘటనకు, దీనికి తేడా ఏంటి? అప్పుడు డెమొక్రాట్ నేషనల్ కమిటీ భవనంలోకి అధికారులు చొరబడితే.. ఈసారి డెమొక్రాట్లు అమెరికా 45వ అధ్యక్షుడి ఇంట్లోకి బలవంతంగా వచ్చారంటూ మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు వెనుకబడిన దేశాల్లోనే జరుగుతుంటాయన్నారు. ఇప్పుడు అమెరికా కూడా ఆ దేశాల్లో ఒకటిగా మారిపోవడం బాధాకరమన్నారు.
