అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తొలి ప్రసంగంలో సంచలన ప్రకటన చేశారు. అమెరికా దక్షిణ సరిహద్దులో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ‘‘దక్షిణ సరిహద్దుల్లో మరిన్ని బలగాలను మోహరిస్తాం.. అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తాం.. విదేశీ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపుతాం’’ అంటూ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు.
‘‘వెంటనే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి నా మంత్రివర్గం పని చేస్తుంది. ధరలను తగ్గిస్తాం.. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్‌ఫాక్చరింగ్ దేశంగా అమెరికా అవతరిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అమెరికా.. ఆటో మొబైల్ రంగాన్ని అనూహ్యరీతిలో ముందుకు తీసుకెళ్తాం. పౌరులు తమకు నచ్చిన మోడల్ వాహనాన్ని కొనుక్కునేలా చేస్తాం. ఎలక్ట్రిక్ వాహనాలను అధికంగా ఉత్పత్తి చేస్తాం. న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేసేలా చూస్తాం.. రాజకీయ కక్ష సాధింపులకు ఆస్కారం ఇవ్వం‘‘ అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
‘‘ఇకపై శత్రువులపై పోరాటమే అమెరికా దళాలకు ఏకైక లక్ష్యం.. ప్రభుత్వంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేస్తాం. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాం. ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తాం. మా ప్రభుత్వ ఏర్పాటుకు ఒక రోజు ముందే ఇజ్రాయెల్ బందీలు ఇంటికి చేరుకున్నారు. గాజా బందీలు ఇంటికి చేరుకోవడం సంతోషం. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తాం.’’ అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
‘‘అమెరికా ఫస్ట్ అనేది మా నినాదం.. నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. చిన్న సమస్యలను కూడా పరిష్కరించే స్థితిలో మన ప్రభుత్వం ఉంది. సరిహద్దుల్లో నేరస్తులు పెట్రేగిపోతున్నారు.. అమెరికా అనేక ఆటుపోట్లు తట్టుకుని నిలబడింది’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
‘‘తుఫాన్లు అమెరికాను అతలాకుతలం చేశాయి. అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాం. విద్య, ప్రజావైద్యం మరింత మెరుగుపరచాల్సి ఉంది. న్యాయవ్యవస్థను పటిష్టం చేస్తాం. అమెరికా ప్రజలకు నేడు స్వాతంత్రత్య దినం. దేశ సరిహద్దుల రక్షణ మనకు ముఖ్యం.. శాంతిభద్రతల విషయంలో మరింత కఠినతరంగా ఉండాలి. అమెరికా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టేందుకు ప్రజలు ముందుకు రావాలి.. దేవుడి దయతో తుపాకీ కాల్పుల నుంచి తృటిలో బయటపడ్డా. 2025 మనకు స్వేచ్ఛాయుత ఇయర్.’’ అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.