NTV Telugu Site icon

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడి బరిలో తెలుగింటి అల్లుడు..! అది ఎలా..?

Jd Vance

Jd Vance

JD Vance: ఇప్పుడు అందరి కళ్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పుల ఘటన తర్వాత అందరి చూపు ఒక్కసారిగా అమెరికా వైపు తిరిగింది.. యూఎస్‌లో ఎన్నికలు ఎప్పుడు? ఎవరు బరిలోకి దిగుతున్నారు..? ప్రత్యర్థులు ఎవరు? అనే విషయంపై అంతా ఆరా తీస్తున్నారు.. ఈ సమయంలో అనూహ్యంగా.. తన తెలుగింటి అల్లుడి పేరు అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలవబోతున్నారని ప్రకటించారు.. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ ను ఆ పార్టీ సోమవారం సాయంత్రం ప్రకటించిన విషయం విదితమే కాగా.. ఇక, ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా ఒహాయో రిపబ్లికన్ సెనేటరు, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ పేరును ప్రకటించారు.. మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశంలో మొదటి రోజునట్రంప్.. జేడీ వాన్స్‌ను తమ ఉపాధ్యక్ష అభ్యర్థిగా వెల్లడించారు..

Read Also: Warts Remove Naturally: ఎలాంటి నొప్పి లేకుండా పులిపిర్లను సహజంగా ఇలా తొలగించుకోండి!

తనపై కాల్పుల తర్వాత తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు ట్రంప్.. మిల్వాకీలో జరిగిన కన్వెన్షన్‌లో పాల్గొన్నారు.. గాయమైన కుడి చెవికి బ్యాండేజీతో కన్వెన్షన్‌కు హాజరైన ట్రంప్‌.. ఎలాంటి ఉపన్యాసం చేయకపోయినా.. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ అధికారికంగా ఎన్నికయ్యారు.. ప్రతినిధులు ఓట్లు వేసి తమ అభ్యర్థిగా ట్రంప్‌ను ఎంపిక చేశారు.. ఆ తర్వాత జేడీ వాన్స్‌ పేరును ప్రకటించారు ట్రంప్‌.. సుదీర్ఘ చర్చల తర్వాత జేడీ వాన్స్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు.. అతడు సమర్థవంతమైన నేతగా సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు ట్రంప్‌.. అంటే ఈ ఏడాది నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తే.. జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు కానున్నారు.. అయితే, ఆయన భార్య తెలుగు మూలాలు ఉన్న కుటుంబానికి చెందిన ఉషా చిలుకూరి వాన్స్.. యునైటెడ్ స్టేట్స్‌కి రెండవ మహిళ కానున్నారు..

Read Also: PM Modi: ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోడీ ప్రసంగం.. ఎప్పుడంటే..?

కాగా, డొనాల్డ్‌ ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత.. ఈ కుట్ర వెనుక ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉందంటూ ట్వీట్‌ చేసి కొత్త చర్చకు తెరలేపారు రిపబ్లికన్ సెనేటర్ జేడీ వాన్స్. ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా ఉన్న ఆయన.. ఇప్పుడు మాత్రం ట్రంప్ కి అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు.. ఇక, వాన్స్‌ భార్య ఉషా చిలుకూరి.. ఒకప్పుడు డెమెక్రటిక్ పార్టీ సభ్యురాలు. కొన్నేళ్ళ కిందట ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అయితే, ఉషా చిలుకూరి మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇది తెలుసుకోవడానికి గూగుల్‌ సహా వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ పామ్‌ను పెద్ద సంఖ్యలు సెర్చ్‌ చేశారు.. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం భారతీయ వలసదారుల బిడ్డ.. భారత సంతతికి చెందిన న్యాయవాది ఉషా చిలుకూరి.. ఆమె తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందట ఏపీ నుంచి వెళ్లి అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. ఇక, ఉషా కూడా అక్కడే పుట్టారు..

Read Also: AP Government: పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం.. కొత్త పరిశ్రమల కోసం సర్కార్‌ కసరత్తు..

ఉషా లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం రాంచో పెనాస్క్విటోస్‌లోని మౌంట్ కార్మెల్ హై స్కూల్‌లో చదివారు. ఆధునిక చరిత్ర ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్. ప్రఖ్యాత యేల్ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో బీఏ చదివారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆధునిక చరిత్రలో ఎంఫిల్ పట్టా అందుకున్నారు.. ఇక, యేల్ యూనివర్శిటీలో జేడీ వాన్స్ తో ఉషాకు పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లికి దారితీసింది.. వారిదద్దరికీ 2014లో కాలిఫోర్నియాలో హిందూ సంప్రదాయం ప్రకారమే వివాహం జరిపించారట.. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. మొత్తంగా.. ఉష భర్త జేడీ వాన్స్‌ అమెరికా ఉపాధ్యక్షుడు అయితే.. యూఎస్‌ రెండో మహిళగా.. వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఓ తెలుగింటి అమ్మయిగా చరిత్ర సృష్టించే అవకాశం లేకపోలేదు.

Show comments