ప్రపంచంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. అమెరికాలో ప్రతిరోజూ లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో సింహభాగం కేసులు డెల్టావేరియంట్ కేసులు ఉండటంతో ఆ దేశం అప్రమత్తం అయింది. వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరిగిపోతుండటంతో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్క్‌ను తప్పనిసరి చేశారు. మరోవైపు విజయవంతంగా ఒలింపిక్స్‌ను నిర్వహించిన జపాన్‌లో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో 12 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. రాత్రి సమయంలో 8 గంటల తరువాత బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు, మాల్స్‌లో ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇక ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే సిడ్నీలో లాక్‌డౌన్ అమలులో ఉన్నది. ఈ లాక్‌డౌన్ ను మరోసారి పొడిగించారు. అటు న్యూసౌత్‌వేల్స్‌లో మరోసారి 600 లకు పైగా కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. గురువారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షలకు పైగా కేసులు, 11 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.