Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇన్నాళ్లు ఉత్తర గాజాను మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ సైన్యం, ఇప్పుడు దక్షిణ గాజాపై కూడా ఫోకస్ పెట్టింది. శనివారం దక్షిణ గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 36 మంది మరణించారు. అంతకుముందు ప్రజల రక్షణ కోసం ఉత్తర గాజాను ఖాళీ చేసి దక్షిణ గాజాకు వెళ్లాలని చెప్పిన ఇజ్రాయిల్, ఇప్పుడు అక్కడ హమాస్ టెర్రరిస్టులను టార్గెట్ చేస్తోంది.
మరోవైపు అక్టోబర్7 నాటి దాడిలో 1400 మందిని చంపిన హమాస్ ఉగ్రవాదులు, 240 మందిని బందీలుగా తీసుకున్నారు. అయితే బందీల విడుదలపై ఇతర దేశాల మధ్యవర్తిత్వంపై చర్చలు జరుగుతున్నాయి. ఖతార్ ఈ చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 5 రోజలు కాల్పుల విరమణ ఉంటుందని, ఆ సమయంలో 50 మంది వరకు బందీలను విడుదల చేస్తారని ఒప్పందానికి వచ్చారని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ‘‘ఖతార్ మధ్యవర్తిత్వ చర్చలు పురోగతికి వచ్చాయని ఇజ్రాయిల్, హమాస్ కనీసం 5 రోజుల పాటు కాల్పుల విరమణ పాటిస్తాయని, తొలుత 50 మంది లేదా అంతకన్నా ఎక్కువ బందీలను, ప్రతీ 24 గంటలకు ఒక బ్యాచ్ చొప్పున విడుదల చేస్తారు’’ అని తెలిపింది.
Read Also: Sanjay Raut: ‘‘మోడీ బౌలింగ్.. అమిత్ షా బ్యాటింగ్’’.. సంజయ్ రౌత్ సెటైర్లు..
అయితే అలాంటి ఒప్పందం ఏం కుదరలేదని ఇజ్రాయిల్, అమెరికా రెండూ తెలిపాయి. దీనిపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. ఇలాంటి ఒప్పందం ఏం లేదని అన్నారు. మేము బందీలుగా ఉన్నవారందరిని విడిపించాలని అనుకుంటున్నామని అన్నారు. మేము స్పష్టంగా బందీలను వారి కుటుంబాల వద్దకు చేర్చాలని అనుకుంటున్నామని చెప్పారు. ‘‘మేం ఇంకా ఏం ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని వైట్‌హౌజ్ నేషనల్ సెక్యురిటీ కౌన్సిల్ ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
మరోవైపు హమాస్ పై పోరులో విరామం ఇస్తే వారు మళ్లీ బలపడే అవకాశం ఉందని ఇజ్రాయిల్ సైన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ సైన్యం, ప్రభుత్వం ఇప్పటి వరకు క్రమక్రమంగా దాడులను పెంచుతుందే తప్పితే, కాల్పుల విరమణ పాటించేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 11,000 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఇందులో 5000 మంది చిన్నారులు ఉండటంపై ప్రపంచదేశాలు కాల్పుల విరమణ పాటించాలని కోరుతున్నాయి.