NTV Telugu Site icon

Cuddle Therapy: గంటసేపు కౌగిలించుకుంటే.. రూ.7వేలు ఇవ్వాల్సిందే

Cuddle Therapy

Cuddle Therapy

మీరు శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో అందరినీ కౌగిలించుకుంటూ ఉంటాడు. అలా చేస్తే మనసులోని ఆందోళన మటుమాయం అవుతుందని చెప్తుంటాడు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాడు. కాకపోతే ఆ సినిమాలో హీరో ఉచితంగా కౌగిలించుకుంటే.. రియల్ లైఫ్‌లో మాత్రం ఆ వ్యక్తి కౌగిలించుకుంటే గంటకు ఇంత అని వసూలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. తమ మనసులోని భావాల్ని ఇతరులతో పంచుకోలేక ఒంటరితనం అనుభవిస్తున్న వారికి భరోసా కల్పించేలా బ్రిటన్ బ్రిస్టల్‌కు చెందిన ట్రెజర్ ప్రయత్నిస్తున్నాడు. అతడిని సంప్రదించగానే ఇంటికి వచ్చి బాధితుడిని దగ్గరకు తీసుకుంటాడు. కౌగిలించుకుని వారి చెప్పింది వింటాడు. తల నిమురుతూ ఆందోళన తగ్గేలా చేస్తాడు. దీని పేరు కడల్ థెరపీ. ఇదంతా ఊరికే కాదండోయ్. గంటకు 75 పౌండ్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.7వేలు వసూలు చేస్తాడు.

Read Also: Organ Donation: తను చనిపోయి.. ఐదుగురిని బతికించింది

అయితే కౌగిలించుకోవడానికి అతడే ఎందుకు.. పైగా డబ్బులు ఇవ్వడం ఎందుకు? ఇంట్లో ఎవరినైనా లేకపోతే స్నేహితులనో, బంధువులనో కౌగిలించుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారా.. ఇదీ నిజమే అయినా అందరికీ బంధువులు ఉండరు. కొందరికి స్నేహితులు కూడా ఉండరు. అందరికీ అలాంటి అదృష్టం ఉండదు. మానవ సంబంధాలు లేకపోవడం వల్ల ఎంతోమంది మానసికంగా కుమిలిపోతున్నారు. ఈ ఆధునిక సమాజంలో ఈ పోకడ మరింత తీవ్రంగా కనిపిస్తోంది. అందుకే ఈ అంశాన్ని కూడా కొందరు వ్యాపారం చేసేస్తున్నారు. ఒంటరితనంతో మానసికంగా క్షోభ పడేవారికి స్వాంతన చేకూర్చాలనే ఉద్దేశంతోనే ట్రెజర్ ఈ వ్యాపారం మొదలుపెట్టాడు. క్రమంగా ఇది వృత్తిగా మారిపోయింది. ఈ వృత్తి కింద పనిచేసే వాళ్లను ప్రొఫెషనల్ కడలర్స్ అని పిలుస్తున్నారు. కడల్ థెరపీ అనేది ఒక్కొక్కరి విషయంలో ఒక్కో తరహాలో ఉంటుందని.. కేవలం కౌగిలింత మాత్రమే కాకుండా వారు కోరుకున్న స్నేహాన్ని, ఓ వ్యక్తి మనకు తోడున్నాడన్న భావనను వాళ్లలో కలిగిస్తానని ట్రెజర్ వివరించాడు.