Site icon NTV Telugu

Copenhagen: డెన్మార్క్ లో కాల్పులు.. ముగ్గురి మృతి

Denmark

Denmark

డెన్మార్క్ కాల్పులతో ఉలిక్కిపడింది. రాజధాని కోపెన్‌హాగన్ లో ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. ఆదివారం బిజీగా ఉండే మాల్ లోకి ప్రవేశించిన దుండగులు రైఫిల్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఇందులో ఒకరు నలబై ఏళ్ల వయస్సున్న వ్యక్తి కాగా.. మరో ఇద్దరు యువకులని డానిష్ పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన నిందితుడిని 22 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే డెన్మార్క్ లో కాల్పులు జరగడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దాడి జరిగిన ప్రాంతం సిటీ సెంటర్, కోపెన్‌హాగన్ ఎయిర్ పోర్టుకు మధ్యలో ఉంది.

అయితే నిందితుడిని పట్టుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడనే దానిపై విచారణ జరుగుతోంది. సోషల్ మీడియాలో మాత్రం జాత్యాంహకార దాడి అని, ఉగ్రవాద దాడి అని ప్రజలు అనుకుంటున్నారు. అయితే దీనిపై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని కోపెన్‌హాగన్ పోలీసులు చెబుతున్నారు. అయితే ఇది ఉగ్రవాద దాడి కాదని చెప్పడానికి లేదని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా..నిందితుడు ఒంటరిగానే ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది.

Read Also: Mamatha Benerjee: మమతా బెనర్జీ ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడిన వ్యక్తి అరెస్ట్

ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు కాల్పులు జరుగుతున్న సమయంలో మాల్ లో ప్రజల రద్దీ ఎక్కువగా ఉంది. కాల్పుల శబ్ధం విన్న ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీశారు. కాల్పులు జరుగుతన్న ప్రదేశానికి సమీపంలో రాయల్ అరేనాలో బ్రిటిష్ సింగర్ హ్యారీ స్టైల్స్ ప్రదర్శన ఉంది. ఈ షో కోసమే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాల్పుల ఘటన జరిగిన తర్వాత ఈ షోను రద్దు చేశారు నిర్వాహకులు. ఈ ఘటన పట్ల డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడ్రిక్సన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో 2015లో కోపెన్‌హాగన్ లో ఇస్లామిక్ ప్రేరేపిత ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో అప్పుడు ఇద్దరు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు.

 

Exit mobile version