Corona Virus: కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ మాదిరిగానే జంతువుల నుంచి మానవుడికి వ్యాపించే ప్రమాదం కలిగి ఉన్న కొత్త వైరస్ చైనా పరిశోధకులు గుర్తించారు. గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు చేసిన కారణంగా ‘‘బ్యాట్ ఉమెన్’’గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వైరాలజిస్ట్ షి జెంగ్లీ, గ్వాంగ్జౌ అకాడమీ ఆఫ్ సైన్స్, వూహాన్ యూనివర్సిటీ అండ్ వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. గతంలో వూహాన్ పరిశోధన కేంద్రం నుంచే ‘‘కోవిడ్-19’’కి కారణమయ్యే కరోనా వైరస్ లీక్ అయిందనే ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Sourav Ganguly: పాకిస్తాన్ పై కాదు.. భారత్ ఛాంపియన్ ట్రోఫీనే గెలుస్తుంది
తాజాగా హాంకాంగ్‌లోని జపసీన్ పిపిస్ట్రెల్ రకం గబ్బిలాలలో ‘‘HKU5 కరోనావైరస్’’ అనే కొత్త రకాన్ని గుర్తించారు. ఈ వైరస్ మెర్బెకోవైరస్ ఉపజాతి నుంచి వచ్చింది, ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) కు కారణమయ్యే వైరస్ కూడా ఈ ఉపజాతికి చెందినదే. ఈ వైరస్ మానవ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE2) తో బంధం ఏర్పరుచుకుంటుంది. సరిగ్గా ఇలాగే కోవిడ్-19కి కారణమయ్యే Sars-CoV-2 వైరస్ కూడా మనవ కణాలకు సోకుతుంది. “HKU5-CoV గబ్బిలాల ACE2 ను మాత్రమే కాకుండా మానవ ACE2 మరియు వివిధ క్షీరదాల ACE2 ఆర్థోలాగ్‌లను కూడా ఉపయోగించుకుంటుందని పీర్-రివ్యూడ్ జర్నల్ సెల్‌లో ప్రచురించిన ఒక రీసెర్చ్ పేపర్ వెల్లడించింది.
గబ్బిలాల నమూనాల నుంచి వైరస్ వేరుచేసినప్పుడు, అది మానవ కణాలకు అలాగే సూక్ష్మీకరించబడిన శ్వాసకోశ లేదా పేగు అవయవాలను పోలి ఉండే కృత్రిమంగా పెరిగిన కణాలకు సోకుతుందని పరిశోధకులు కనుగొన్నారు. HKU5-CoV-2 మానవులలో ACE2 గ్రాహకాలకు మాత్రమే కాకుండా అనేక ఇతర జాతుల కణాల్లో కూడా నివసిస్తాయి, ఇవన్నీ ఇంటర్మీడియట్ హోస్ట్‌లుగా పనిచేసి, మానవులకు వ్యాపింపచేసే అవకాశం ఉంది. వైరస్ పై మరింత పర్యవేక్షణ అవసరమని, అయితే దాని సామర్థ్యం కోవిడ్ వైరస్ కంటే తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. అయినా కూడా దీని వల్ల ఏర్పడే ప్రమాద అవకాశాలను తక్కువ చేయొద్దని పరిశోధకులు చెప్పారు.