NTV Telugu Site icon

Mars: అంగారకుడిపై నీటి జాడలను గుర్తించిన చైనా రోవర్..

Mars Rover

Mars Rover

Mars: భూమి తర్వాత సౌర కుటుంబంలో మానవ నివాసానికి అనువైన గ్రహంగా శాస్త్రవేత్తలు అంగారకుడిని భావిస్తున్నారు. మూడు బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడి వాతావరణం కూడా భూమిని పోలిన విధంగా ఉండేది. అయితే కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా ప్రస్తుతం ఆ గ్రహం ఎర్రటి మట్టితో నిర్జీవంగా తయారైంది. అంగారకుడి రహస్యలను తెలుసుకునేందుకు చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాసా, చైనా, యూరోపియన్ యూనియన్ స్పేస్ సెంటర్లు అనేక రోవర్లను అంగారకుడిపైకి పంపాయి. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం సముద్రం, నదులు ఏర్పరిచిన గుర్తులను ఇవి గుర్తించాయి.

ఇదిలా ఉంటే అంగారకుడిపైకి 2021లో చైనా జురాంగ్ అనే రోవర్ ను పంపింది. ప్రస్తుతం ఈ రోవర్ అంగారకుడిపైకి భూమధ్య రేఖ వైపు, ధృవాలకు దూరంగా ఉన్న ఇసుక దిబ్బలపై లిక్విడ్ వాటర్ కు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించింది. మూడు బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడిపై పెద్ద సముద్రాలు, నదులు ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంగారకుడి అంతర్భాగంలో జరిగిన మార్పులు, ఆ గ్రహంపై అయస్కాంత క్షేత్రాన్ని బలహీన పరచడంతో అక్కడి వాతావరణం, నీరు నెమ్మనెమ్మదిగా విశ్వంలో కలిసిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే..భూమధ్య రేఖకు దగ్గరగా తక్కువ అక్షాంశాల వద్ద ద్రవ నీటి ఉనికికి సంబంధించి ఈ రోజు వరకు ఎలాంటి ఆధారాలు అందించబడలేదు.

Read Also: Ukraine ‘Maa Kali’ tweet: “కాళీ మాత” ఫోటోతో వివాదాస్పద ట్వీట్ చేసిన ఉక్రెయిన్.. భారతీయుల ఆగ్రహం

తాజా పరిశోధన ఇప్పుడు మార్స్ పరిణామ చరిత్రను అర్థం చేసుకోవడంలో ఒక పెద్ద పురోగతిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం జురాంగ్ పంపిన డేటాను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. రోవర్ నేరుగా మంచు లేదా మంచు రూపంలోని నీటిని గుర్తించలేదని, బదులుగా పగుళ్లు, క్రస్ట్ లతో ఉప్పు అధికంగా ఉండే దిబ్బలను గుర్తించిందని తెలిపారు. రోవర్ మొదటిసారిగా అంగారకుడి దిబ్బలపై పగిలిన పొరను కనుగొంది. ఇది రెడ్ ప్లానెట్ పై 4,00,000 ఏళ్ల క్రితం ఉప్పు సమృద్ధిగా ఉన్న నీటి ప్రపంచాన్ని సూచిస్తుందని అధ్యయనం తెలిపింది. అంగారకుడిపై ఉష్ణోగ్రతల్లో హెచ్చతగ్గులు మారుతుంటాయి కాబట్టి ఉప్పునీరు ఆవిరై ఉప్పు, కొన్ని ఖనిజలవణాలు మిగిలి ఉంటాయని చైనా పరిశోధకులు భావిస్తున్నారు.

రోబోటిక్ రోవర్ యొక్క నావిగేషన్ మరియు టెర్రైన్ కెమెరా, మల్టీస్పెక్ట్రల్ కెమెరా మరియు మార్స్ సర్ఫేస్ కంపోజిషన్ డిటెక్టర్ ద్వారా ఈ డేటాను శాస్త్రవేత్తలు పొందారు. మట్టి దిబ్బల పొరల్లో హైడ్రేటెడ్ సల్ఫేట్లు, హైడ్రేటెడ్ సిలికా, ఐరన్ ఆక్సైడ్ ఖనిజాలు మరియు బహుశా క్లోరైడ్‌లు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.