Xi Jinping opens 20th Communist Party Congress: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ 20వ సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ఈ సమావేశాలను ప్రారంభించారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ సమావేశాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. దీంతో రాజధాని బీజింగ్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా పేరు తెచ్చుకున్న జిన్ పింగ్ మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అక్టోబర్ 16 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. దాదాపుగా 2300 కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
Read Also: Ebola outbreak: ఉగాండాలో “ఎబోలా” కల్లోలం.. లాక్‌డౌన్ విధింపు
బీజింగ్ లోని తియానన్ మెన్ స్వ్కేర్ కు పశ్చిమాన ఉన్న గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అద్యక్షుడు జిన్ పింగ్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశంలో 200 మందితో ఉండే సెంట్రల్ కమిటీ సభ్యులను ఎంపిక చేయనున్నారు. 25 మందితో పొలిట్ బ్యూరో, శక్తివంతమైన స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనున్నారు. రాబోయే ఐదేళ్లకు కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యాలు, దేశం అభివృద్ధి గురించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జిన్ పింగ్ తన కొత్త పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. చైనా ప్రధానిగా లీ కెకియాంగ్ రెండు పర్యాయాలు పనిచేశారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని ప్రధానిగా నియమించనున్నారు.
ఇదిలా ఉంటే ప్రారంభ ప్రసంగంలో కమ్యూనిస్ట్ పార్టీ పాలనను కొనియాడారు జిన్ పింగ్. హాంకాంగ్ పై చైనా పూర్తి నియంత్రణ సాధించిందని ఆయన అన్నారు. తైవాన్ విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవడాన్ని ఖండించారు. తైవాన్ వేర్పాటువాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 2018లో అధ్యక్ష పదవిని రెండుసార్లు చేపట్టాలనే నియమాలను జిన్ పింగ్ తొలిగించారు. 2012లో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న జిన్ పింగ్, పదేళ్ల పాటు పదవిలో ఉన్నారు. ప్రస్తుతం మూడోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నాయకుడిగా జిన్ పింగ్ పేరు సంపాదించారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు అత్యంత శక్తివంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ గా జీ జిన్ పింగ్ మరోసారి అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్నారు.