China Warns America After Nancy Pelosi Taiwan Visit: యావత్ ప్రపంచాన్ని ఉత్కంఠ రేపిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ‘తైవాన్ పర్యటన’ ఎట్టకేలకు ముగిసింది. తమ భూభాగం కాకపోయినప్పటికీ తైవాన్ తమదేనని చెప్పుకుంటోన్న చైనా.. నాన్సీ పర్యటన గురించి తెలిసి, ఆమె అక్కడ అడుగుపెట్టడానికి ముందే తీవ్రంగా హెచ్చరించింది. తైవాన్‌లో అడుగుపెడితే, తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా.. తైవాన్ పర్యటనని తైవాన్‌లో అడుగుపెట్టింది. తైపేలో అడుగుపెట్టిన నాన్సీ.. తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాము తైవాన్‌కు అండగా ఉంటామని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఎవరూ లాక్కోలేరంటూ పరోక్షంగా చైనాకు చురకలంటించారు. అనంతరం కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, అక్కడి నుంచి దక్షిణ కొరియా వెళ్లారు.
తాము హెచ్చరించినా పట్టించుకోకుండా నాన్సీ పెలోసీ తైవాన్‌కు వెళ్లడం, అక్కడ తమకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడంతో.. చైనా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. తైపేలో అడుగుపెట్టడానికి తైవాన్ సమీపంలో భారీగా ఆయుధాల్ని మోహరించిన చైనా.. తాజాగా నాన్సీ పర్యటనపై తీవ్రంగా మండిపడింది. ‘‘ప్రజాస్వామ్యం ముసుగులో చైనా సార్వభౌమత్వాన్ని అమెరికా ఉల్లంఘిస్తోంది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఇదంతా కేవలం ఒక డ్రామా. నిప్పుతో చెలగాటం ఆడాలనుకునేవారు.. ఆ మంటల్లోనే కలిపోతారు. చైనాను అవమానించాలని చూసేవారిని శిక్షించే తీరుతాం’’ అంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ హెచ్చరించారు. కాగా.. పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా తైవాన్‌పై చైనా పలు ఆంక్షలు విధించింది. తైవాన్ నుంచి చేపలు, పండ్ల దిగుమతిని నిషేధించింది. అలాగే చైనా నుంచి తైవాన్‌కు ఎగుమతి అయ్యే ఇసుకపై కూడా బ్యాన్ విధించింది.