Site icon NTV Telugu

PM Modi: ప్రధాని మోడీకి తైవాన్ అభినందనలు.. ఉడికిపోతున్న చైనా..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల్లో గెలుపొంది, మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే పలు దేశాల అధినేతలు ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు. అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక ఇలా పలు దేశాల అధ్యక్షుడు, ప్రధానులు తమ అభినందన సందేశాలను పంపించారు. తైవాన్ ప్రెసిడెంట్ లై చింగ్-తే కూడా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల విజయంపై నా హృదయపూర్వక అభినందనలు. ఇండోపసిఫిక్‌లో శాంతి, శ్రేయస్సుకు దోహదపడేలా వాణిజ్యం, సాంకేతికత ఇతర రంగాల్లో మా సహకరాన్ని విస్తరించడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న తైవాన్-భారత భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మేము ఎదురుచూస్తున్నాం’’ అంటూ తన సందేశాన్ని తెలియజేశారు.

Read Also: Yogi Babu: ఫేస్ బుక్ లవ్.. సినీ ఫక్కీలో తమ్ముడికి సీక్రెట్ గా పెళ్లి చేసిన టాప్ కమెడియన్

తైవాన్ ప్రెసిడెంట్ లై శుభాకాంక్షలకు స్పందించిన ప్రధాని మోడీ ‘‘మీ సందేశానికి ధన్యవాదాలు, పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక మరియు సాంకేతిక భాగస్వామ్యానికి కృషి చేస్తున్నందున నేను సన్నిహిత సంబంధాల కోసం ఎదురుచూస్తున్నాను.’’ అని స్పందించారు. అయితే, ప్రస్తుతం భారత్-తైవాన్ మధ్య ఈ వ్యాఖ్యలు చైనాకు రుచించడం లేదు. భారత్ అంటేనే వ్యతిరేకించే చైనా, తనలో భాగమని చెబుతున్న తైవాన్ ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలపడంపై ఉడికిపోతోంది.

గురువారం మీడియా సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ.. తైవాన్ ప్రాంతానికి అధ్యక్షుడు ఎవరూ లేరని చెప్పింది. ప్రపంచంలో ‘‘వన్ చైనా’’ విధానం ఉందని, ఇందులో తైవాన్ భాగమని, తైవాన్ చైనాలో విడదీయలేని భాగమని ఆమె చెప్పారు. ‘‘వన్ చైనా’’ విధానం అంతర్జాతీయ సమాజంలో ప్రబలమైన ఏకాభిప్రాయమని మావో నింగ్ అన్నారు. తైవాన్ అధ్యక్షుడికి మోడీ థాంక్స్ చెప్పడంపై చైనా భారత్‌కి తన నిరసన తెలిపింది. భారత్‌కు చైనాతో దౌత్య సంబంధాలు ఉన్నాయని మావో అన్నారు. తైవాన్ అధికారులు మరియు చైనాతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న దేశాల మధ్య అన్ని రకాల అధికారిక పరస్పర చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని చెప్పారు.

Exit mobile version