China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్‌కు ప్రణాళిక

  • డ్రాగన్ కొత్త ఎత్తుగడ
  • భారత్ సరిహద్దులో కొత్త కారిడార్‌కు ప్రణాళిక
  • భారత్‌ను పక్కన పెట్టిన చైనా
China

China

భారత్‌ను వ్యూహాత్మకంగా చుట్టుముట్టే ప్రయత్నాలను చైనా మరింత వేగవంతం చేస్తోంది. పశ్చిమాన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ద్వారా అరేబియా సముద్రానికి చేరుకున్న బీజింగ్.. ఇప్పుడు తూర్పు దిశగా చైనా-మయన్మార్-బంగ్లాదేశ్ ఎకనామిక్ కారిడార్ (CMBC) ప్రాజెక్టును తిరిగి తెరపైకి తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టులో భారత్‌కు ఎలాంటి పాత్ర లేకుండా ముందుకు సాగాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్ ఇటీవల నాలుగు రోజుల చైనా పర్యటన సందర్భంగా ఈ కారిడార్ అంశం మరోసారి చర్చకు వచ్చింది. బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశంలో ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి ఈ కారిడార్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు చర్చించినట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.

చైనాకు చెందిన బంగ్లాదేశ్ రాయబారి యావో వెన్ మాట్లాడుతూ.. దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన బంగ్లాదేశ్-చైనా-భారత్-మయన్మార్ (BCIM) కారిడార్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని చెప్పారు. అయితే కొత్త కారిడార్‌లో భారత్ చేరాలనుకుంటే స్వాగతమేనని.. దీని ప్రధాన ఉద్దేశం ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక సహకారమేనని పేర్కొన్నారు.

కొత్త కారిడార్ మార్గం ఇదే

ప్రతిపాదిత CMBC కారిడార్ చైనా యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్ నుంచి ప్రారంభమై మయన్మార్‌లోని మండలే వరకు చేరుతుంది. అక్కడి నుంచి ఒక మార్గం యాంగోన్, మరో మార్గం రఖైన్ రాష్ట్రంలోని క్యౌక్‌ఫ్యూ లోతట్టు నౌకాశ్రయం వరకు వెళ్తుంది. అక్కడి నుంచి రఖైన్ మీదుగా బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ (చట్టోగ్రామ్), కాక్స్ బజార్ ప్రాంతాలకు అనుసంధానం చేయాలనే ప్రణాళికను చైనా సిద్ధం చేస్తోంది. దీని ద్వారా బంగాళాఖాతంలోని చిట్టగాంగ్, మోంగ్లా నౌకాశ్రయాలకు నేరుగా చేరుకోవాలనేది బీజింగ్ లక్ష్యం.

ఈ కారిడార్ వాస్తవానికి 1990లలో ప్రతిపాదించిన బంగ్లాదేశ్-చైనా-భారత్-మయన్మార్ (BCIM) కారిడార్‌కు కొత్త రూపంగా భావిస్తున్నారు. అప్పట్లో కున్మింగ్ నుంచి మండలే, ఢాకా మీదుగా కోల్‌కతా వరకు ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అయితే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI)పై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం, భారత్-చైనా సంబంధాలు దెబ్బతినడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. 2019లో BCIMను అధికారిక BRI జాబితా నుంచి కూడా తొలగించారు.

యుద్ధ ప్రాంతం గుండా కారిడార్

అయితే ఈ ప్రాజెక్టు అమలు అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ కారిడార్ మయన్మార్‌లో అంతర్యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న రఖైన్ రాష్ట్రం గుండా వెళ్తుంది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం దేశ భూభాగంలో కేవలం ఐదో వంతు మాత్రమే నియంత్రిస్తోంది. మిగిలిన ప్రాంతాలు తిరుగుబాటు దళాలు, జాతి ఆధారిత సాయుధ సంస్థల ఆధీనంలో ఉన్నాయి. దీంతో ఈ ప్రాజెక్టు అమలుపై అనిశ్చితి నెలకొంది.

బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో శాంతి నెలకొన్న తర్వాతే భూభాగ అనుసంధానంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

భారత్‌కు వ్యూహాత్మక సవాలు

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. పశ్చిమాన CPEC, తూర్పున CMBC ద్వారా చైనా భారత్‌ను వ్యూహాత్మకంగా చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే గిల్గిట్-బాల్టిస్థాన్ మీదుగా వెళ్లే CPECను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు బంగాళాఖాతంలో కూడా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి చైనా ప్రయత్నించడం భారత్‌కు కొత్త సవాల్‌గా మారే అవకాశముందని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా తారిఖ్ రెహ్మాన్- జిన్‌పింగ్ సమావేశంలో తీస్తా నది నిర్వహణ, వరద నియంత్రణ, సాగునీటి ప్రాజెక్టులు, గ్రీన్ ఎకానమీ, డిజిటల్ రంగంలో సహకారం వంటి అంశాలపై కూడా పలు ఒప్పందాలు కుదిరాయి. అలాగే వన్ చైనా పాలసీకి బంగ్లాదేశ్ మరోసారి మద్దతు ప్రకటించింది.