China Enshrines Opposition To Taiwan Independence Into Its Constitution: చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. దీంతో పలు కీలక తీర్మాణాలు చేస్తోంది ఆ పార్టీ. దీంట్లో భాగంగానే తైవాన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ శనివారం తన రాజ్యాంగంలో తైవాన్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా నిబంధనలను తీసుకువచ్చింది. తైవాన్ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ముగింపు సమావేశాల్లో తీర్మాణం చేసింది. తైవాన్ విషయంలో వేర్పాటువాదాన్ని ధృఢంగా వ్యతిరేకించడం, తైవాన్ స్వాతంత్య్రాన్ని అడ్డుకోవడం వంటి నిర్ణయాలను రాజ్యాంగంలో పొందుపరిచేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. ఈ సమావేశాల్లో జి జిన్ పింగ్ కు మరోసారి పట్టం కట్టేందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మరోసారి ఆమోదం తెలిపింది. దీంతో మూడోసారి జి జిన్ పింగ్ అధికారాన్ని చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. పార్టీ చార్టర్ లో మార్పులపై అంతా ఏకగ్రీవంగా తీర్మాణాన్ని ఆమోదించారు.
Read Also: Yogi Adityanath: ఎన్‌కౌంటర్లలో 166 మంది నేరస్తులను లేపేశాం..
చైనా చర్యపై తైవాన్, యూఎస్ఏ ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇప్పటికే తైవాన్ విషయంలో సిద్ధంగా ఉండాలని అమెరికా సైనికాధికారులు సూచిస్తున్నారు. అమెరికా కూడా తైవాన్ స్వాతంత్య్రానికి కట్టుబడి ఉంటామని హామీ ఇస్తోంది. తైవాన్ ను రక్షించేందుకు సిద్ధంగా ఉంటామని అగ్రరాజ్యం పలు మార్లు వ్యాఖ్యానించింది. అయితే కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాల్లో జి జిన్ పింగ్ స్వాగతోపన్యాసం చేస్తూ.. తైవాన్ విషయంలో బలప్రయోగం చేయడానికి కూడా వెనకాడమని.. చైనా సార్వభౌమాధికారాన్ని రక్షించుకుంటామని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో తైవాన్ ద్వీప భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఇప్పటికే చైనా, తైవాన్ ను కవ్విస్తోంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చైనా కూడా తైవాన్ ను స్వాధీనం చేసుకుంటుందని అంతా భావిస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి తైవాన్ సముద్ర తీరం, గగనతలాన్ని ఉల్లంఘిస్తోంది పీపుల్ రిపబ్లిక్ ఆర్మీ. చాలాసార్లు చైనా ఫైటర్ జెట్లు, బాంబర్లు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. అయితే తైవాన్ కూడా చైనా ఆంక్షలను లెక్కచేయడం లేదు. సై అంటే సై అంటోంది.