Site icon NTV Telugu

China Interest Rates: చైనాలో రియల్ సంక్షోభం.. వడ్డీ రేట్ల తగ్గింపు

China Pbc

China Pbc

ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది? చైనా ఏం చేయబోతోంది? రియల్ ఎస్టేట్ రంగంలో ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చైనా ఏం చేయబోతోంది? అనేవి కీలకంగా మారాయి. విశ్వవ్యాప్తంగా ఆర్థిక మందగమన భయాలు అలుముకుంటున్న వేళ చైనా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రపంచంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులన్నీ కీలక వడ్డీ రేట్లను పెంచుతుండగా చైనా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. అక్కడ వడ్డీరేట్లు తగ్గిస్తోంది. వడ్డీరేట్ల తగ్గింపుతో సంక్షోభంలో కూరుకుపోయిన స్థిరాస్తి రంగానికి చైనా ఊతమిస్తోంది. రెండో దశ కొవిడ్‌ విజృంభణతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోంది. చైనా నిర్ఱయాలు భారత్ కు అనుకూలంగా మారతాయని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: Andhra Pradesh: ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు.. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు

కరోనాకారణంగా అన్నిచోట్ల వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. అయితే, ఆరోగ్యరంగానికి సంబంధించిన ఫార్మా రంగం మాత్రమే వృద్ధిని నమోదుచేసింది. చైనాలో కొనుగోళ్లు నిలిచిపోయి ఆ దేశ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా పడిపోతోంది. అక్కడ చాలా దిగ్గజ సంస్థలు దివాళా తీశాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలోని నగదును చలామణిలోకి తీసుకురావడం కోసం కీలక నిర్ణయాలకు తెరతీసింది చైనా.. రుణాలపై వడ్డీరేట్లు తగించడం ద్వారా అక్కడ ద్రవ్య లభ్యత అధికమవుతుందని చైనా భావిస్తోంది.

చైనాలో స్థిరాస్తి సంక్షోభం సుదీర్ఘంగా కొనసాగితే.. అక్కడి నుంచి విదేశీ పెట్టుబడులు.. భారత్‌ వంటి వర్ధమాన దేశాలకు తరలే అవకాశం ఉంది. కొత్తగా ఎలాంటి పెట్టుబడులు చైనాకు వెళ్ళవంటున్నారు. మెరుగైన వృద్ధి రేటు సాధిస్తున్న భారత్‌లోకి చైనాకు వెళ్లాల్సిన పెట్టుబడులన్నీ తరలి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ లో రేట్లు పెరిగినా.. ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో విదేశీ పెట్టుబడులు పుంజుకుంటే మార్కెట్లకు మరింత దన్ను లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

చైనా కేంద్ర బ్యాంక్‌ పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (పీబీసీ) వడ్డీరేట్లు తగ్గించింది. ఏడాది కాలపరిమితిలోపు ఉండే రుణాలపై కనీస వడ్డీ రేటును 2.85 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించింది. దీనికి తోడుగా రుణ పరపతి పెంచేందుకు బ్యాంకులకు అదనంగా 6,000 కోట్ల డాలర్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది చైనా జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతం మించలేదు. వృద్ధి రేటు ఇలానే కొనసాగితే ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్న 5.5 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధించడం అసాధ్యం అంటున్నారు. అందుకే వడ్డీరేట్లు తగ్గింపు ఉద్దీపనలకు దిగింది.

Exit mobile version