భూకంపం వచ్చినపుడు భవనాలు ఊగిపోతుంటాయి. నేలమట్టం అవుతుంటాయి. ఆకాశాన్ని తాకే భవనాల్లో ఉండే ప్రజలు భూకంపం వచ్చినపుడు బయటకు పరుగులు తీస్తుంటారు. భూకంపం నుంచి తట్టుకునే విధంగానే పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తుంటారు. అయితే, చైనాలోని షెన్ జెన్ నగరంలో ఉన్న 72 అంతస్తుల సెగ్ ప్లాజా భవనం ఉన్నట్టుండి ఊగిపోయింది. భూకంపం వచ్చిన సమయంలో ఎలాగైతే భవనాలు ఊగిపోతాయో అలా ఊగిపోయింది. దీంతో ఆ భవనంలో పనిచేస్తున్న ఉద్యోగులను హుటాహుటిన బయటకు పంపించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భవనం ఊగిపోవడంతో మొత్తం ఉద్యోగులను ఖాళీ చేయించి బయటకు పంపడానికి గంటన్నర సమయం పట్టింది. 72 అంతస్తులను ఖాళీ చేయించి అధికారులు ఆ భవనానికి సీజ్ చేశారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఎక్కడా భూకంపం వచ్చిన ఛాయలు కనిపించలేదు. కానీ, సెగ్ ప్లాజా భవనం ఒక్కటే ఊగిపోయింది. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఎందుకు భవనం ఆ విధంగా ఊగిపోయింది అనే దానిపై అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.