Site icon NTV Telugu

Pakistan: ప్రాణాల కోసం ఏడుస్తున్న పాక్ సైనికులు.. BLA కొత్త వీడియో..

Bla

Bla

Pakistan: పాకిస్తాన్ సైన్యానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ముచ్చెమటలు పట్టిస్తోంది. బలూచిస్తాన్‌లో పనిచేయాలంటేనే పాక్ భద్రతా బలగాలు వణికిపోతున్నాయి. బలూచ్ యోధులు ఇటీవల పాక్ సైనికుల్ని బందీలుగా పట్టుకున్నారు. పాక్ జైళ్లలో ఉన్న బీఎల్ఏ తిరుగుబాటుదారుల్ని విడిచిపెడితే, పాక్ సైనికుల్ని విడిచిపెడుతామని హెచ్చరిస్తున్నారు. పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి బీఎల్ఏ 7 రోజులు అల్టిమేటం విధించింది. ఒక వేళ గడువు దాటితే పాక్ సైనికుల్ని చంపేస్తామని హెచ్చరించింది.

తాజాగా, బీఎల్ఏ మరో వీడియో విడుదల చేసింది. కనీసం 8 మంది పాక్ సైనికులు బీఎల్ఏ వద్ద బందీలుగా ఉన్నట్లు చూపిస్తోంది. అయితే, పాక్ ప్రభుత్వం మాత్రం వాళ్లు సైనికులు కాదని చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన వీడియోలో సైనికులు తమ కార్డులు, సైన్యంలో తమ ర్యాంక్, నెంబర్లు చెబుతున్నారు. పాక్ సైన్యం తమను సైనికులుగా గుర్తించకపోవడాన్ని జీర్ణించుకోలేని బందీలు ఏడుస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Read Also: చిప్స్ తినడం మానకపోతే శరీరానికి జరిగే నష్టం ఇదే.!

తమను రక్షించాలని ఐడీ కార్డులు, సర్వీస్ కార్డులు చూపుతూ అధికారుల్ని పాక్ సైనికులు వేడుకుంటున్నారు. ‘‘మనం సైనికులం కాదని ఆర్మీ ఎలా చెబుతుంది. ఈ కార్డ్ ఎవరిది.? ఇది నా ఐడెంటిటీ కార్డ్, దీన్ని పాక్ ప్రభుత్వం ఇచ్చింది. నా తండ్రి దివ్యాంగుడు, నేను ఇంట్లో పెద్దవాడిని, మమ్మల్ని సైనికులు కాదని చెప్పి అన్యాయం చేయొద్దు. మమ్మల్ని మీరు రిక్రూట్ చేశారు. ఇప్పుడు ఎలా సైనికులు కాదని చెబుతారు? ’’ అని ప్రశ్నించడం వీడియోలో కనిపిస్తుంది.

‘‘ఆపరేషన్ హెరోఫ్’’ పేరుతో బలూచిస్తాన్ వ్యాప్తంగా పాక్ భద్రతా బలగాలపై బీఎల్ఏ విరుచుకుపడింది. ఆ సమయంలోనే కొందరు పాక్ సైనికుల్ని బందీలుగా పట్టుకుంది. బలూచిస్తాన్‌కు చెందిన వారిని బీఎల్ఏ విడుదల చేసింది. మిగతా వారిని బందీలుగా ఉంచుకుంది. రెగ్యులర్ పాకిస్తాన్ ఆర్మీ యూనిట్లు చెందిన వారే అని బీఎల్ఏ చెబుతోంది. వీరిపై బలూచ్ నేషనల్ కోర్టులో విచారణ జరిపి, శిక్ష విధిస్తామని బీఎల్ఏ హెచ్చరించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఖైదీల మార్పిడి కి సిద్ధమైతే శిక్షలు ఆపుతామని చెబుతోంది. అయితే, పాక్ సైన్యం మాత్రం ఏ సైనికులు మిస్సింగ్ కాలేదని, ఎవరూ పట్టుబడలేదని చెప్పింది. ఖైదీల మార్పిడి అవకాశం లేదని స్పష్టం చేసింది.

Exit mobile version