Site icon NTV Telugu

Nawaz Sharif: అణు పరీక్ష ఆపడానికి బిల్ క్లింటన్ 5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేశాడు.. భారత్‌కి తగిన జవాబు ఇచ్చాం..

Nawaz Sharif

Nawaz Sharif

Nawaz Sharif: నాలుగేళ్ల ప్రవాసం తర్వాత పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగివచ్చారు. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఇస్లామాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి తన కంచుకోట అయిన పంజాబ్ ప్రావిన్సులోని లాహోర్‌కి భారీ ర్యాలీ నడుమ వచ్చారు. దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశించి ర్యాలీలో ప్రసంగించారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో సాధించిన విజయాల గురించి ఆయన ప్రజలకు వివరించారు.

చాలా ఏళ్ల తరువాత నేను మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందని, మీతో నా బంధం అలాగే ఉందని, దీనికి గర్వపడుతున్నానని నవాజ్ షరీఫ్ అన్నారు. 1998లో పాకిస్తాన్ అణు పరీక్షలు జరపకుండా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు తెలిపారు. నాకు కూడా 1 బిలియన్ డాలర్ ఆఫర్ చేయవచ్చేమో, కానీ నేను పాకిస్తాన్ భూమిలో పుట్టాను, అలాంటి పనులు చేయలేదని తెలిపారు.

Read Also: Mahua Moitra: చిక్కుల్లో ఎంపీ మహువా మోయిత్రా.. వివాదానికి దూరంగా తృణమూల్..

నా స్థానంలో మరెవరైనా ఉండి ఉంటే, అమెరికా అధ్యక్షుడి ముందు తలవంచేవారని అన్నారు. మేము అణు పరీక్ష నిర్వహించాము, అణు పరీక్షలు నిర్వహించిన భారతదేశానికి తగిన జవాబు ఇచ్చామనని ప్రజలను ఉద్దేశించి అన్నారు. దాదాపు గంటపాటు ఆయన మాట్లాడారు. ఇవన్నీ చేసినందుకు మనం శిక్షించబడతామా..? అని ప్రజలను ప్రశ్నించారు. తన మద్దతుదారులకు ద్రోహం చేయలేదని, ఎలాంటి త్యాగాలకు వెనుకడుగు వేయలేదని నవాజ్ షరీఫ్ అన్నారు. తనపై, తన కూతురుపై , పార్టీ నేతలపై అబద్దపు కేసులు బనాయించారని గుర్తు చేశారు.

నవాజ్ షరీఫ్ ను దేశం నుంచి వేరు చేసింది ఎవరో చెప్పండి..? పాకిస్తాన్ నిర్మించింది మనమే, పాకిస్తాన్ ను అణుశక్తిగా మార్చింది మనమే అని ఆయన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విమర్శిస్తూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్రస్తుతం దారుణ పరిస్థితుల్లో ఉందని, పాకిస్తాన్ ని అభివృద్ధి పథంలోకి మళ్లీస్తానని ప్రతిజ్ఞ చేశారు.

Exit mobile version