Site icon NTV Telugu

మరో కీలక నిర్ణయం తీసుకున్న తాలిబన్లు

తాలిబన్లు…క్రూరత్వానికి పరాకాష్ట. మధ్యయుగం నాటి సంప్రదాయాలను, ఛాందసవాదంతో అమలు చేసే పాలకులు. ఉగ్రవాదుల స్థానం నుంచి అఫ్ఘాన్ పాలకులుగా మారిన తాలిబన్లు.. ఆ తర్వాత తాము ప్రజాస్వామ్యంగా పాలిస్తామని హామీ ఇచ్చారు. అంతేనా ఎన్నో చెప్పారు.. కానీ తర్వాత్తర్వాత అవన్నీ తూచ్ అన్నారు. దీంతో అంతర్జాతీయ సమాజం.. తాలిబన్లను అనుమానంతో చూడడం మొదలు పెట్టింది.

ఉగ్రవాదులుగా ఉండడం వేరు.. పాలించడం వేరు.. ఈవిషయం కాస్త ఆలస్యంగా తాలిబన్లకు అర్థమైంది. ఓవైపు కునారిల్లిన ఆర్థికవ్యవస్థ, ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి. అఫ్ఘాన్ల ఆకలి కేకలు, అంతర్జాతీయ సమాజం నుంచి అందని సహకారం వెరసి, తాలిబన్లను ఇబ్బందుల్లోకి నెట్టింది. దీనికి తోడు తాలిబన్లలోని వివిధ వర్గాలు సైతం పరస్పర విభేదాలతో ఉన్నాయి. పేదరికం కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌లో బలవంతపు పెళ్లిళ్లు సర్వసాధారణంగా మారాయి.

అప్పుకింద అమ్మాయిలను చెల్లించడం, విక్రయించడం అక్కడ అనాదిగా వస్తోంది. అంతేకాదు, అక్కడి గిరిజన తెగల్లోని మహిళలు భర్త చనిపోతే అతడి అన్నదమ్ముల్లో ఒకరిని చేసుకోవాలన్న నియమం కూడా ఉంది. తాజాగా, తాలిబన్లు జారీ చేసిన ఆదేశాలతో వీటన్నింటికీ చెక్ పడనుంది. అంతేకాదు, భర్తను కోల్పోయిన మహిళ 17 వారాల తర్వాత తన ఇష్టప్రకారం నచ్చిన వ్యక్తిని పెళ్లాడే స్వేచ్ఛ ఇస్తున్నట్టు కూడా తాలిబన్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.నిజానికి ఆప్ఘనిస్థాన్ తిరిగి తాలిబన్ల వశమయ్యాక ఎక్కువగా భయపడింది ఆ దేశంలోని మహిళలే. వారిపై కఠిన ఆంక్షలు ఉంటాయని అందరూ భావించారు. అణచివేత, వేధింపులు తప్పవని భయపడిపోయారు. దీంతో చాలామంది దేశం విడిచి పారిపోయారు. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ తాలిబన్లు మహిళల వివాహం విషయంలో.. తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Exit mobile version