శ్రీలంక రోజురోజుకీ ఆర్థిక సంక్షోభంలో మరింత కూరుకుపోతోంది.. అన్ని విధాలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ఇంధనం కొరత తీవ్రంగా ఉండడంతో కరెంట్ కోతలు అర్థరాత్రుల వరకూ కొనసాగుతున్నాయి. నెలలు దాటినా ఇదే పరిస్థితి. ఇంట్లో పిల్లా పాపలు సహా అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు గత నెల కన్నా రెట్టింపు అయ్యాయి. రోజు రోజుకూ పరిస్థితి దిగజారిపోతోందే తప్ప ఆశ చిగురించట్లేదు. ఉదయం లేచి ఏదో తిన్నామన్నట్టు తిని లేదా అసలు తినకుండా బయటకు పరుగులు పెట్టడం.. అసలు యుద్ధం ఇక్కడ మొదలవుతుంది. పెట్రో కష్టాలు అంతా ఇంతా కాదు.. రోజుల తరబడి క్యూలైన్లలో వేచిఉండాల్సిన పరిస్థితి.. దీంతో, పెట్రో బంక్‌ల దగ్గర క్యూలైన్లు రైళ్లను తలపిస్తున్నాయి..
Read Also: Police: నాగేశ్వరరావు కేసులో అసలు ఏం జరిగింది..?
ఆటో డ్రైవర్లు తమ వాహనాల్లో ఎనిమిది లీటర్లు పెట్రోలు పోయించుకోడానికి రోజుల తరబడి క్యూలలో నిల్చుంటున్నారు. ఎనిమిది లీటర్లతో బహుశా ఓ రెండు రోజులు గడుస్తుంది. మళ్లీ క్యూ కట్టాల్సిందే. బట్టలు, తలగడలు, నీళ్లు తెచ్చుకుని క్యూలలోనే జీవితం గడుపుతున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.. క్యూలైన్లలో ఉన్నవారికి కొన్ని రోజులు మధ్య, ఎగువ తరగతి ప్రజలు తమ ఇళ్ల పక్కనే క్యూలలో నిల్చున్నవారికి భోజనం పొట్లాలు, వాటర్ అందించారు.. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆహారం, వంట గ్యాస్, బట్టలు, రవాణా, విద్యుత్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. శ్రీలంక రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో, డబ్బున్నవారికి కూడా కష్టాలు మొదలయ్యాయి. శ్రామిక వర్గాల్లో ప్రజలు కట్టెల పొయ్యి వాడడం మొదలుపెట్టారు. కడుపు నింపుకోడానికి రోజూ ఇంత అన్నం, కొబ్బరి పచ్చడి వండుకోగలిగితే చాలన్నట్టు ఉంది వాళ్ల పరిస్థితి.
అయితే, శ్రీలంక ఆర్థిక సంక్షోభం సమయంలో పెరిగిన పెట్రో ధరల మూలంగా అటు వైపు వెళ్లడానికి కొందరు వణికిపోతున్నారు.. ధరల భారం ఒకటైతే.. ఆ క్యూలైన్‌లోకి వెళ్తే.. ఎప్పుడు బయటకు వస్తాం అనే గ్యారంటీ కూడా లేకుండాపోయింది.. దేశంలో ఇంధన కొరత నేపథ్యంలో శ్రీలంకలో సైకిళ్లకు డిమాండ్ పెరిగిపోయింది.. మేం పెట్రోల్‌ను కొనుగోలు చేయలేము.. ఆ పెట్రోల్ కోసం క్యూలలో ఉండలేం.. ఒక వేళ క్యూలైన్‌లో ఉన్నా.. పెట్రోల్ దొరుకుతుందన్న భరోసా లేదు.. దీంతో సైకిళ్లు కొనుగోలు చేస్తున్నామని పలువురు వ్యక్తులు చెబుతున్నారు.. సామాన్యుడు కొనలేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కులనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బయటకు బండి తీయాలంటేనే వణికిపోతున్న ప్రజలు.. వాహనాలకు బదులు సైకిళ్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీటికి ఫుల్ డిమాండ్ పెరిగింది. దుకాణాల్లో సైకిళ్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వీటినే కొనుగోలు చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు కూడా వీటిపైనే వెళ్తున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో చాలా మందికి సైకిళ్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌గా మారాయని చెబుతున్నారు. అయితే, కొందరి ఆర్థిక పరిస్థతి.. సైకిళ్లను కూడా కొనకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
