సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ భార్య అస్మా మరణపు అంచుల్లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తీవ్రమైన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇక వైద్యులు కూడా చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. కేవలం 50-50 శాతమే అస్మా బతికే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
అస్మా లుకేమియాతో పోరాడుతున్నారు. అస్మా తొలుత 2019లో రొమ్ము కేన్సర్‌తో పోరాడారు. ఒక సంవత్సరం చికిత్స తర్వాత విజయం సాధించారు. కేన్సర్ రహిత పేషెంట్‌గా వైద్యులు వెల్లడించారు. రొమ్ము కేన్సర్ నుంచి ఉపశమనం పొందిన కొద్ది రోజుల తర్వాత బ్లడ్ కేన్సర్ బయటపడింది. దీంతో ఆమె పరిస్థితి మరింత విషమంగా మారింది. ప్రస్తుతం బ్లడ్ కేన్సర్ తీవ్ర స్థాయికి వెళ్లినట్లు సమాచారం. వైద్యులు చికిత్స అందిస్తున్నా.. 50 శాతమే బతికే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో అధ్యక్షుడు అసద్ కుటుంబం రష్యాకు పారిపోయింది. రాజకీయ శరణార్థిగా జీవితం గడుపుతున్నారు. అయితే అస్మాకు రష్యాలో ఉండడం ఏ మాత్రం ఇష్టం లేదు. అస్మా.. బ్రిటీష్ పౌరురాలు. దీంతో ఆమె.. భర్త అసద్‌కు విడాకులు ఇచ్చి.. పిల్లలతో కలిసి సొంత దేశమైన యూకేకు వెళ్లిపోవాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. యూకేలోనే చికిత్స తీసుకోవాలని భావించినట్లు సమాచారం. అయితే ఈ వార్తలను బ్రిటీష్ పీఎంవో ఖండించింది. అస్మా యూకేకు రాలేదని తేల్చి చెప్పింది. దేశం విడిచి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కోరుతూ అస్మా రష్యా కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ అప్లికేషన్ ప్రస్తుతం రష్యన్ అధికారుల సమీక్షలో ఉంది.