Site icon NTV Telugu

Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. హసీనా పదవీచ్యుతి తర్వాత తొలి ఎలక్షన్స్..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలకు తేదీలు ఖరారయ్యాయి. బంగ్లా 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలను 2026, ఫిబ్రవరి 12 నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీరుద్దీన్ దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఈ ప్రకటన చేశారు. స్వేచ్ఛాయుతమైన, ప్రజాస్వామ్యబద్ధమైన ఓటింగ్ నిర్వహించగలమని ప్రపంచానికి నిరూపించేందుకు దేశం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. నకిలీ వార్తలు, పుకార్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజల్ని కోరారు.

Read Also: Rahul Gandhi: అమిత్ షా ఒత్తిడిలో ఉన్నారు, అందుకే తప్పుడు భాష వాడారు..

సార్వత్రిక ఎన్నికలు, జూలై చార్టర్‌ ప్రజాభిప్రాయ సేకరణకు ఓటింగ్ ఫిబ్రవరి 12న ఏకకాలంలో జరుగుతుందని ఎన్నికలక కమిషనర్ తెలిపారు. మొత్తం 300 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రవాస బంగ్లాదేశీయులు రేపటి నుంచి డిసెంబర్ 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం, నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 29, 2025 (సోమవారం). నామినేషన్ పత్రాల పరిశీలన డిసెంబర్ 30, 2025 (మంగళవారం) నుండి జనవరి 4, 2026 (ఆదివారం) వరకు జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జనవరి 20, 2026 (మంగళవారం) వరకు సమయం ఉంటుంది.

గతేడాది ఆగస్టులో హింసాత్మక నిరసనల తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్నికలు నిర్వహించే వరకు యూనస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మరోవైపు, యూనస్ హయాంలో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ, దాని కార్యకర్తలపై అణిచివేత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి బంగ్లా ఎన్నికల్లో ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), మతతత్వ జమాతే ఇస్లామీ పార్టీలు కీలకం కాబోతున్నాయి.

Exit mobile version