Site icon NTV Telugu

Bangaldesh: బంగ్లాదేశ్‌లో హై అలర్ట్.. రేపు షేక్ హసీనా కేసులపై తీర్పు..

Sheikh Hasina

Sheikh Hasina

Bangaldesh: గతేడాది బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనల తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చింది. అయితే, ఈ హింసాత్మక ఉద్యమంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు హసీనాపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) నేరాలను మోపింది. ఈ కేసులో నవంబర్ 13న తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హై అలర్ట్ నెలకొంది.

బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీర్పుకు ముందే ఉద్రిక్తతలు పెరిగాయి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, కీలక ప్రదేశాల్లో సైన్యం, పోలీసులు మోహరించారు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ గురువారం దేశవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. అన్ని వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. మహ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక పాలకుడు అయిన తర్వాత, షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం విధించాడు. అయినప్పటికీ, ఆ పార్టీ నేతలు గుర్తుతెలియని ప్రాంతాల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. గత రెండు రోజులుగా రాజధాని ఢాకాతో సహా బంగ్లాదేశ్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వాహనాలు దహనమయ్యాయి. అవామీ లీగ్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఆకస్మిక ర్యాలీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు దేశవ్యాప్తంగా ఆపరేషన్లు చేపట్టారు.

Read Also: Afghanistan Pakistan Relations: పాక్‌కు తాలిబన్ ప్రభుత్వం షాక్.. పాకిస్థాన్‌తో వాణిజ్యం లేదంటూ ప్రకటన!

జూలై 2024లో విద్యార్థుల తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది. ఆగస్టు 5, 2024న, ఆమె భారతదేశానికి పారిపోయారు. ఆ తర్వాత ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, జూలై నిరసనల సందర్భంగా దాదాపు 1,400 మంది మరణించి ఉండవచ్చుని అంచనా. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై విముక్తి యుద్ధంలో జరిగిన మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలను విచారించడానికి షేక్ హసీనా పరిపాలన మొదట అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడే ఇదే ట్రిబ్యునల్ షేక్ హసీనాపై చట్టపరమైన చర్యల్ని ప్రారంభించింది. ఈ కేసులో సాక్ష్యాల విచారణ పూర్తయింది. గురువారం ట్రిబ్యునల్ తీర్పు చెప్పనుంది.

Exit mobile version