బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ బుధవారం తెలిపారు. నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం ప్రమాణస్వీకారం చేయనుందని ఆర్మీ చీఫ్ జమాన్ పేర్కొన్నారు.
ఆర్మీ చీఫ్ జమాన్ మీడియా మాట్లాడుతూ.. తాత్కాలిక ప్రభుత్వం గురువాకం రాత్రి 8 గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలిపారు. సలహా మండలిలో 15 మంది సభ్యులు ఉండవచ్చని చెప్పారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ మంగళవారం.. మాజీ ప్రధాని షేక్ హసీనాను తొలగించిన తర్వాత మధ్యంతర ప్రభుత్వానికి సారథ్యం వహించాలని యూనస్ (84)ను ఎంపిక చేశారు.
యూనస్ బ్యాగ్రౌండ్ ఇదే..
యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి వైస్‌ఛాన్సలర్‌గా ఉన్నారు. అలాగే చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలందించారు. అంతేకాకుండా బంగ్లాదేశ్‌లోని పేదల అభ్యున్నతి కోసం కృషిచేశారు. చిట్టగాంగ్‌లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థిక వేత్త. మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.
ఇదిలా ఉంటే కోటా ఉద్యమం కారణంగా జరిగిన అల్లర్లలో 440 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు చేదాటడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. అనంతరం ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు.