Site icon NTV Telugu

Ukraine Crisis: అండర్‌గ్రౌండ్‌లో ప్రసవించిన గర్భిణి

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరేలా కనిపిస్తోంది. వరుసగా మూడోరోజు కూడా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ నగరంపై బాంబుల దాడి సాగుతోంది. రష్యా సైనికుల బాంబు దాడుల నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డేందుకు కీవ్ నగరంలో స్థానికులు అండ‌ర్‌గ్రౌండ్ మెట్రో స్టేష‌న్‌లో త‌ల‌దాచుకుంటున్నారు. ఆ మెట్రో స్టేష‌న్లే ఇప్పుడు బాంబు షెల్టర్లు. అక్కడ త‌ల‌దాచుకుంటున్న ఓ గ‌ర్భిణి ప్రస‌వించింది. బేబీకి జ‌న్మనిచ్చిన‌ విష‌యాన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కాగా మెట్రో స్టేష‌న్‌లనే బంక‌ర్లుగా వాడుతున్న స్థానికులు ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ ద్వారా క‌మ్యూనికేట్ చేసుకుంటున్నారు. అండ‌ర్ గ్రౌండ్ మెట్రో రైళ్లు న‌డుస్తున్నాయి. అయినా స్థానికులు ఫ్లాట్‌ఫారాల‌ను ఆవాసాలుగా మార్చుకుని బిక్కుబిక్కుమంటూ రోజులు గ‌డుపుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్‌ నగరంలో గడ్డకట్టే చలితో పాటు బాంబుల మోత ప్రజలను వణికిస్తోంది. గురువారం ఉష్ణోగ్రత మైనస్‌ 2 డిగ్రీలు ఉండగా శుక్రవారం ఒక్కసారిగా మైనస్‌ 6 డిగ్రీలకు పడిపోయింది. ఒకవైపు దట్టమైన మంచు కురుస్తుంటే మరోవైపు మిసైల్‌ దాడులతో నగరం అగ్నిగుండంగా మారింది. కళ్లముందు పేలుతున్న బాంబులను చూస్తూ ఎముకలు కొరికే చలికి వణుకుతూ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.

Exit mobile version