ఆస్ట్రేలియా ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. 2007 తర్వాత తొలిసారి ఎన్నికల్లో గెలుపొందడంతో… ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 151 స్థానాలున్న సభకు సభ్యుల్ని ఎన్నుకునేందుకు శనివారం పోలింగ్ జరిగింది. కరోనా దృష్ట్యా 1.70 కోట్ల మంది ముందస్తు ఓటింగ్ లేదా పోస్టల్ విధానాన్ని ఎంచుకున్నారు. మిగతా ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ద్రవ్యోల్బణంలో దేశ వాసులకు ఉపశమనం కల్పించేందుకు ఆర్థిక సాయం, సామాజిక భద్రతను పెంచుతామని లేబర్ పార్టీ హామీ ఇచ్చింది. పక్కనే ఉన్న సాల్మన్ దీవుల్లో చైనా సైనిక ఉనికికి స్పందనగా పొరుగు దేశాల సైన్యాలకు శిక్షణ ఇచ్చేందుకు పసిఫిక్ డిఫెన్స్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇవన్నీ ఆ పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించాయి.
Read Also: TSRTC : పదో తరగతి విద్యార్థులక శుభవార్త.. బస్సుల్లో ఫ్రీ..
ఇక, కొత్త ప్రధాని ఆంటోనీ అల్బనీస్.. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే విదేశీ పర్యటన బాట పట్టారు.. సోమవారం ఉదయం కాన్ బెర్రాలో హంగు, ఆర్భాటాలు లేకుండా ప్రమాణస్వీకారం చేశారు.. విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, ఆర్థిక మంత్రి కాటీ గల్లాఘర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. జపాన్ ఫ్లైట్ ఎక్కారు ఆంటోనీ.. జపాన్ లోని టోక్యోలో క్వాడ్ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే కాగా.. ఆ సదస్సులో పాల్గొననున్నారు. మరోవైపు, భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు అధ్యక్షులు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదిలను తాను స్వయంగా కలుస్తానని ప్రధాన మంత్రిగా ఎన్నికైన అనంతరం మీడియాకు వివరించారు ఆంటోనీ అల్బనీస్.