Site icon NTV Telugu

Pakistan: పాకిస్థాన్ లో సిక్కులపై దాడులు.. ఆ దేశ దౌత్యవేత్తకు భారత్ సమన్లు

Pakistan

Pakistan

Pakistan: పాకిస్థాన్ లో సిక్కులపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో భారత ప్రభుత్వం సీరియస్‌ అయింది. గడచిన మూడు నెలల్లోనే దుండగులు నలుగురు సిక్కులను కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో సీరియస్‌గా రియాక్ట్ అయిన కేంద్రం .. సిక్కులపై దాడుల విషయంలో విచారణ జరిపి.. నివేదికను అందజేయాలని ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.

Read also: Fire Accident: వామ్మో.. ఎక్కడి మంటలు.. గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైదాకా నిప్పుల కుంపటే

పాకిస్థాన్ లో సిక్కులపై జరుగుతున్న దాడులపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ సీనియర్ దౌత్యవేత్త కు సమన్లు జారీ చేసింది. సిక్కులపై పెరుగుతున్న దాడులపై వివరణ ఇవ్వాలని కోరింది. సిక్కు కమ్యూనిటీపై దాడుల కేసును చిత్తశుద్ధితో దర్యాప్తు చేసి, దాని నివేదికను త్వరితగతిన అందజేయాలని పాక్ అధికారులను కేంద్ర ప్రభుత్వం కోరింది. అవసరమైతే సరిహద్దు వెంబడి దాడులు చేయాల్సి వస్తుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లో సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఘటనలపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఘటనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మతపరమైన హింసపై నిరంతరం భయపడుతూ జీవిస్తున్న తమ మైనారిటీల భద్రతకు పాకిస్థాన్ భరోసా కల్పించాలని డిమాండ్ చేసింది. సిక్కు కమ్యూనిటీపై 2023 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య నాలుగు దాడులు జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించింది.

Read also: CM KCR: సీఎం కేసీఆర్ కు శ్రీవిట్టల్ రుక్మణి విగ్రహాన్ని బహూకరించిన భక్తుడు

గత శనివారం గుర్తుతెలియని సాయుధులు సిక్కు కమ్యూనిటీ సభ్యుడిని కాల్చి చంపినట్లు పాకిస్థాన్ కు చెందిన ఒక పత్రిక ప్రకటించింది. కాల్పుల్లో మరణించిన వ్యక్తి మూడు నెలల్లో చనిపోయిన నాలుగో వ్యక్తి. ఈ ఘటన కక్షల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుడిని 34 ఏళ్ల మన్మోహన్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. ఆయన ఎప్పటిలాగే శనివారం సాయంత్రం ఆటోలో ఇంటికి వెళ్తుండగా కక్షల్ లోని గుల్దారా సమీపంలో గుర్తుతెలియని సాయుధులు ఆయనపై కాల్పులు జరిపారని రాజధాని నగర పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీనియర్ పోలీసు అధికారులు, దర్యాప్తు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను ఇతర ఆధారాలను సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే శుక్రవారం కూడా ప్రావిన్స్ రాజధానిలోని డబ్గారి ప్రాంతంలో మరో సిక్కు వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఆయనను మఖాన్ సింగ్ కుమారుడు తార్లూగ్ సింగ్ గా గుర్తించారు. ఈ కాల్పుల్లో ఆయన కాలుకి గాయాలు అయ్యాయి. దీంతో ఆయనను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
మే నెలలో తూర్పు నగరమైన లాహోర్ లో దుండగులు సర్దార్ సింగ్ ను కాల్చి చంపారు. 63 ఏళ్ల సింగ్ తలకు బుల్లెట్ తగలడంతో ఆయన చనిపోయారు. సిక్కు కమ్యూనిటీ సభ్యుడిపై ఇది మూడవ దాడి. ఈ దాడిలో అతడి బాడీ గార్డ్ కూడా గాయపడినట్లు పోలీసు అధికారి చెప్పినట్టు పాకిస్తాన్‌కు చెందిన పత్రిక ప్రకటించింది. ఏప్రిల్ లో పెషావర్ లో దయాల్ సింగ్ ను ముష్కరులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.

Exit mobile version