Site icon NTV Telugu

Boat Capsizes: మౌరిటానియా తీరంలో పడవ బోల్తా.. 89 మంది మృతి

Boat

Boat

Boat Capsizes: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మౌరిటానియా తీరంలో పడవ బోల్తా పడటంతో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. వలసదారులు యూరప్‌కు వెళ్లేందుకు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. నైరుతి మౌరిటానియాలోని ఎన్‌డియాగోకు నాలుగు కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ తీరంలో పడవ బోల్తా పడింది. 89 మంది అక్రమ వలసదారుల మృతదేహాలను మౌరిటానియన్ తీర రక్షకులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. 6 రోజుల క్రితం సెనెగల్-గాంబియా సరిహద్దు నుంచి యూరప్ వైపు బయలుదేరిన పడవలో 170 మంది వలసదారులు ఉన్నారు. ఐదేళ్ల బాలికతో సహా తొమ్మిది మందిని కోస్ట్ గార్డులు రక్షించారు. 70 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. వీరి కోసం పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also: UK Elections: బ్రిటన్ ప్రజలు లేబర్ పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు?

అట్లాంటిక్‌ను దాటి ఐరోపాకు వెళ్లేందుకు ప్రతిరోజూ వందలాది మంది ఈ ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారు. మధ్యధరా ప్రాంతంలో భారీ భద్రతను ప్రవేశపెట్టిన తరువాత అట్లాంటిక్‌ మార్గం గుండా వలసలు విస్తృతంగా పెరిగాయి. ఈ ప్రమాదకరమైన సముద్ర ప్రయాణానికి పనికిరాని చెక్క పడవలు వినియోగిస్తున్నారు. పడవల నిండా మనుషులు, సరిపడా నీరు, ఆహారం లేకుండా ప్రమాదానికి గురవుతున్నారు. స్పానిష్ స్వచ్ఛంద సంస్థ కామినారో ఫ్రాంటెరాస్ ప్రకారం, ఈ సంవత్సరం సముద్రం దాటి స్పెయిన్‌కు వెళ్లే ప్రయత్నంలో 5,000 మందికి పైగా వలసదారులు మరణించారు. ఇక్కడ ప్రతిరోజూ 33 మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.

యెమెన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రమాదాలు
ఇంతకు ముందు యెమెన్, ఆఫ్ఘనిస్తాన్‌లలో ఇలాంటి రెండు పెద్ద ప్రమాదాలు జరిగాయి. యెమెన్‌లోని అడెన్ నగరానికి సమీపంలో తీరంలో పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 45 మందికి పైగా మరణించారు. సుమారు 140 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇప్పటి వరకు కనుగొనబడలేదు. ప్రమాదంలో బాధితులు హార్న్ ఆఫ్ ఆఫ్రికాకు చెందినవారు. ఎర్ర సముద్రం దాటడానికి ప్రయత్నిస్తుండగా.. కానీ సుడిగుండంలో చిక్కుకుని సముద్రంలో గల్లంయ్యారు. పని కోసం సౌదీ అరేబియా చేరుకోవడానికి తరచుగా వలస కార్మికులు తూర్పు మార్గంలో ప్రయాణిస్తారు. వారు యెమెన్‌లోని ఎర్ర సముద్రం దాటడానికి ప్రయత్నిస్తారు. కానీ సుడిగుండంలో చిక్కుకుని నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోతారు. యెమెన్‌లో ప్రమాదాన్ని మరువకముందే, ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ నది దాటుతుండగా పడవ బోల్తా పడింది ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version