అమెరికా, ఇరాన్ మధ్య విభేదాలను తగ్గించేందుకు పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్ పర్యటన ఎలాంటి పురోగతి లేకుండానే ముగిసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు సాగుతుందని తొలుత భావించిన ఈ పర్యటన కేవలం ఒక్కరోజుతోనే ముగిసిందని ఓ సీనియర్ భద్రతా అధికారి వెల్లడించారు.
ఇరాన్‌తో చర్చల కోసం అసిమ మునీర్ కొన్ని “ప్రత్యేక, రహస్య” ప్రతిపాదనలు తీసుకెళ్లినప్పటికీ.. వాటిని టెహ్రాన్ తిరస్కరించినట్లు సమాచారం. అమెరికా ముందుగా తమ షరతులను నెరవేర్చాల్సిందేనని ఇరాన్ నేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటి అంశాలపై కూడా ఇరాన్ తన డిమాండ్లను కొనసాగించినట్లు సమాచారం.
ఖమేనీతో భేటీ కాలేదు..
అసిమ్ మునీర్ పర్యటనలో మరో కీలక పరిణామం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తబా ఖమేనీతో భేటీ జరగకపోవడం. ఇరాన్ అత్యంత కీలకమైన వ్యూహాత్మక, జాతీయ భద్రతా నిర్ణయాల్లో సుప్రీం లీడర్‌ది కీలక పాత్ర. దీంతో మునీర్ ఆయనను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆ భేటీ మాత్రం జరగలేదని సదరు భద్రతా అధికారి తెలిపారు. అయితే మునీర్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాలకు సంబంధించిన అంశాలతో పాటు ప్రాంతీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. కానీ ఇరాన్ వైఖరిలో ఎలాంటి మార్పు తీసుకురావడంలో మునీర్ పర్యటన విఫలమైనట్లు తెలుస్తోంది.
‘రహస్య ప్రతిపాదనలు’ తిరస్కరణ
భద్రతా వర్గాల ప్రకారం.. ఉద్రిక్తతలను తగ్గించేందుకు మార్గం సుగమం చేయాలనే ఉద్దేశంతో మునీర్ టెహ్రాన్‌కు కొన్ని “ప్రత్యేక, గోప్యమైన” ప్రతిపాదనలు తీసుకెళ్లారు. అయితే ఇరాన్ నాయకత్వం వాటిని అంగీకరించలేదు. అమెరికా ముందుగా ఇరాన్ విధించిన షరతులను నెరవేర్చిన తర్వాతే ఏదైనా ఒప్పందం లేదా పరిష్కారంపై చర్చించగలమని టెహ్రాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. హార్ముజ్ జలసంధికి సంబంధించిన అంశాలపైనా ఇదే వైఖరిని కొనసాగించినట్లు తెలుస్తోంది.
మునీర్ పర్యటనను ఇరాన్‌కు చెందిన ప్రభుత్వ అనుబంధ మీడియా కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది. బుధవారం వెలువడిన ట్రెహాన్ టైమ్స్ ఎడిషన్‌లో మునీర్.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో సమావేశమైన ఫొటోను ప్రముఖంగా ప్రచురించింది. ‘Gambler’s Hand Revealed to Iran’ అనే శీర్షికతో కథనం ప్రచురించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఆర్థిక యుద్ధం కొనసాగిస్తూ.. ఘర్షణ నుంచి బయటపడేందుకు “పరువు కాపాడుకునే మార్గం” కోసం మునీర్‌ను పంపినట్లు కథనం పేర్కొంది. దీంతో మునీర్ పర్యటనను ఇరాన్ తన చర్చల వైఖరిని మార్చేందుకు వచ్చిన మధ్యవర్తిత్వ ప్రయత్నంగా కాకుండా.. అమెరికా సంక్షోభం నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంగా చూసినట్లు తెలుస్తోంది.
ఒమన్ వైపు ఇరాన్ మొగ్గు?
ఇదే సమయంలో హార్ముజ్ జలసంధికి సంబంధించి ఇరాన్, ఒమన్ మధ్య కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ బిన్ హమూద్ అల్ బుసైదీతో టెహ్రాన్‌లో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో హార్ముజ్ జలసంధిలో తాత్కాలిక మార్గం ఏర్పాటు, సముద్రంలో అమర్చిన మైన్ల తొలగింపు వంటి ప్రతిపాదనలు చర్చకు వచ్చినట్లు ట్రెహాన్ టైమ్స్ తెలిపింది.
ఇరాన్, పాశ్చాత్య దేశాల మధ్య గతంలోనూ మధ్యవర్తిగా వ్యవహరించిన అనుభవం ఒమన్‌కు ఉంది. దీంతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. హార్ముజ్ సహా కీలక అంశాలపై టెహ్రాన్ ఇతర ప్రాంతీయ దేశాలతోనూ సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.
పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ
అమెరికా-ఇరాన్ మధ్య విభేదాలను తగ్గించేందుకు పాకిస్థాన్ చేస్తున్న తాజా ప్రయత్నం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మునీర్ ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించడం, ఆయన రెండు రోజుల పర్యటన ఒక్కరోజుకే పరిమితం కావడం, ముఖ్యంగా సుప్రీం లీడర్ ఖమేనీతో భేటీ జరగకపోవడం పాకిస్థాన్‌కు ప్రతికూల పరిణామాలుగా మారాయి.
అమెరికా తన హామీలను ముందుగా నెరవేర్చాల్సిందేనని ఇరాన్ మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య మధ్యవర్తిత్వం చేయాలని ప్రయత్నిస్తున్న ఇస్లామాబాద్‌కు సవాళ్లు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్ తన వైఖరిలో ఎలాంటి మార్పు చేయకపోవడంతో.. మునీర్ తాజా పర్యటన కూడా ఎలాంటి స్పష్టమైన దౌత్యపరమైన పురోగతి లేకుండానే ముగిసినట్లు సమాచారం.

