NTV Telugu Site icon

Iran-Saudi Arabia: బద్ధ శత్రువులు ఇరాన్, సౌదీల ఒకటవుతున్నారు.. మధ్యవర్తిత్వం వహించిన చైనా

Iran China Saudi

Iran China Saudi

Iran-Saudi Arabia: అరబ్ ప్రపంచంలోనే బద్ధ శత్రువులుగా ఉన్న ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య మళ్లీ సంబంధాలు మొదలువుతున్నాయి. గత కొన్ని దశాబ్ధాలుగా ఇరు దేశాల మధ్య తీవ్రమైన వైరం ఉంది. అయితే తాజాగా చైనా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కూడా దౌత్య సంబంధాలు పెట్టుకునేందుకు సిద్ధం అయ్యాయి. ఇరు దేశాలు కూడా రెండు దేశాల్లో తమ రాయబార కార్యాలయాలు తెరిసేందుకు అంగీకరించాయి. మిడిల్ ఈస్ట్ లో యెమెన్, సిరియా వంటి దేశాల్లో ఘర్షణలకు, భద్రతా ముప్పుకు కారణం అయ్యాయి ఈ రెండు దేశాలు. తాజాగా వీటన్నిటిని పక్కనపెట్టి సంబధాలు పునరుద్ధరించుకోవడానికి శుక్రవారం అంగీకరించాయి.

మిడిల్ ఈస్ట్ లో శక్తివంతమైన దేశాలుగా ఉన్న ఇరాన్, సౌదీల భద్రతా అధికారులు బీజింగ్ లో నాలుగు రోజుల క్రితం చర్చలు జరిపాయి. ప్రస్తుతం జరిగిన ఒప్పందం ప్రకారం ఇదే దేశాల సార్వభౌమాధికారం, గౌరవం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని అంగీకరించాయి. షియా ముస్లిం మతగురువును సౌదీ అరేబియా ఉరి తీయడం, టెహ్రాన్ లోని రాయబార కార్యాలయంపై దాడి జరగడంతో ఇరాన్, సౌదీ అరేబియాతో 2016లో సంబంధాలు తెంచుకుంది. 2019లో సౌదీ చమురు క్షేత్రాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిగియా. ఈ ఘటన వెనక ఇరాన్ ఉందని సౌదీ ఆరోపించింది. అయితే ఇరాన్ వీటిని ఖండించింది.

Read Also: Bilawal Bhutto Zardari: కాశ్మీర్ అంశాన్ని ముఖ్యమైన ఎజెండా చేయడానికి పాక్ ప్రయత్నిస్తోంది..

ఇదిలా ఉంటే యెమన్ హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతు ఇస్తోంది. దీంతో ఈ గ్రూప్ సౌదీపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. 2022లో యూఏఈకి కూడా ఈ దాడులు విస్తరించాయి. తాజాగా జరిగిన ఒప్పందంలో ఇరాన్ యొక్క అత్యున్నత భద్రతా అధికారి అలీ శంఖానీ మరియు సౌదీ అరేబియా జాతీయ భద్రతా సలహాదారు ముసేద్ బిన్ మొహమ్మద్ అల్-ఐబాన్ సంతకాలు చేశారు. 2001 భద్రతా సహకార ఒప్పందాన్ని, అలాగే వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ మరియు పెట్టుబడులపై మరొక మునుపటి ఒప్పందాన్ని ప్రారంభించేందుకు ఇరు దేశాలు ఒప్పుకున్నాయి.

షియా ముస్లిం వర్గానికి ఇరాన్, సున్నీ ముస్లిం వర్గానికి సౌదీ ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మధ్యప్రాచ్యంలో అనేక ఘర్షణలకు ఈ రెండు దేశాలు వ్యతిరేక పక్షాలకు మద్దతు ఇచ్చాయి. ప్రస్తుతం మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ముస్లిం దేశాలైన సౌదీ, యూఏఈ శత్రువుగా భావించే ఇజ్రాయిల్ తో కూడా సంబంధాలు పెట్టుకున్నాయి. మరోవైపు జో బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత సౌదీ, అమెరికా మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇదే సమయంలో చైనా అరబ్ దేశాలకు దగ్గర అవుతోంది.