Anti-Hijab Protest In Iran: మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి మరణం ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ దేశాన్ని కుదిపేస్తుంది. హిజాబ్ ధరించలేదని చెబుతూ.. మహ్సా అమినిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి చనిపోయింది. ఈ మరణం యావత్ దేశాన్ని కుదిపేసింది. మహిళలు, యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి ప్రభుత్వానికి, ఇరాన్ సుప్రీం లీడర్ కు వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హిజాబ్ ను విసిరేస్తూ.. జట్టు కత్తిరించుకుని మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మహ్సా అమిని తండ్రి అమ్జాద్ అమినీ కీలక విషయాలను వెల్లడించారు. తన కూతురిని మోరాలిటీ పోలీసులు కొట్టారని ఆరోపించారు. మహ్సా అమినిని అరెస్ట్ చేసినప్పుడు ఆమె పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని.. ఆమెకు గుండెకు సంబంధించి వ్యాధి ఉందని అక్కడి అధికారులు చెప్పారు. దీన్ని మహ్సా అమిని తండ్రి పూర్తిగా ఖండించారు. అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కనీసం తన కుమార్తె శవ పరీక్ష నివేదికను కూడా చూసేందుకు అధికారులు అనుమతించలేదని అమ్జాద్ అమినీ వెల్లడించారు.
Read Also: Bus Accident in Nepal: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు బోల్తా.. 12మంది మృతి
అరెస్ట్ సమయంలో నా కొడుకు, నా కుమార్తెతో ఉన్నారని.. కొంతమంది సాక్షులు మహ్సా అమిని అరెస్ట్ చేసిన తర్వాత వ్యాన్ లో, పోలీస్ స్టేషన్ లో పోలీసులు కొట్టారని చెప్పారని ఆయన బీబీసీ పర్షియన్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. మహ్సా అమినిని తీసుకెళ్లద్దని నా కుమారుడు ప్రాధేయపడిని పోలీసులు కనికరించలేదని.. నా కుమారుడిని కూడా కొట్టారని.. బట్టలు చింపేశారని అమ్జాబ్ అమిని చెప్పారు. నా కుమర్తెను చూపించమని అడిగితే.. పోలీసులు బాడీ కెమెరాలు, కెమెరాల బ్యాటరీలు అయిపోయాయని చెప్పారని ఆయన తెలిపారు. నా కుమార్తెకు జలుబు తప్ప ఏ విధమైన అనారోగ్యం లేదని మహ్సా అమిని తండ్రి అమ్జాబ్ అమినీ వెల్లడించారు.
హిజాబ్ వ్యతిరేక నిరసనలను ఇరాన్ ప్రభుత్వం క్రూరంగా అణచివేస్తోంది. ఇప్పటికే అక్కడి భద్రతాబలగాల దాడుల్లో 30 మందికి పైగా మరణించారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. సోషల్ మీడియాపై బ్యాన్ విధించారు.
