Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..

  • రానున్న పదేళ్లలో క్యాన్సర్, అల్జీమర్స్ లేని ప్రపంచం..
  • ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ అంచనా..
  • ఏఐతో జీవశాస్త్రంలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యలు..
Anthropic Ceo

Anthropic Ceo

Anthropic CEO: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ సీఈఓ డారియో అయోడెమ్ అన్నారు. ఏఐ టెక్నాలజీతో జీవిశాస్త్ర పరిశోధనలు, ఔషధాల అభివృద్ధి, వైద్య ఆవిష్కరణల వేగం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక వ్యాధులు రానున్న 10 ఏళ్లలో అంతరించిపోతాయని ఆయన అన్నారు. మానవాళి వేల ఏళ్లుగా పరిష్కరించలేకపోతున్న అనేక సమస్యల్ని పరిష్కరించే అవకావశం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీని సరైన రీతిలో వినియోగించుకోవాలని చెప్పారు.

అమెడెయ్ మాత్రమే కాదు, ఇతర ప్రముఖ ఏఐ రంగ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేుశారు. గతంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, గుగూల్ ఏఐకు చెందిన డెమిస్ హసాబిస్ కూడా వైద్యరంగంలో ఏఐ ద్వారా భారీ మార్పులు వస్తాయని అన్నారు. ఔషధాల అభివృద్ధికి పట్టే పదేళ్ల కాలాన్ని ఏఐ సాయంతో కొన్ని వారాల్లోనే సాధించవచ్చని హసాబిస్ అన్నారు. ప్రోటీన్ల నిర్మాణాలను అంచనా వేసిన ఆల్ఫాఫోల్డ్ (AlphaFold) సాంకేతికతను ఆయన కీలక ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఏఐ వ్యవస్థ 20 కోట్లకు పైగా ప్రోటీన్ నిర్మాణాలను మ్యాప్ చేయడంలో సహాయపడింది.

అయితే, టెక్ రంగ నిపుణులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే, ఔషధాలను అభివృద్ధి చేసే శాస్త్రవేత్తలు, ఫార్మా సంస్థలు మాత్రం ఇది అనుకున్నంత సులువు కాదని చెబుతున్నారు. వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ లీడెన్ ఈ అంచనాలను తీవ్రంగా విమర్శించారు. సుమారు 50 ఏఐ కంపెనీల సాంకేతికతను పరీక్షించి, 10 వేల ఔషధ సమ్మేళనాలను పరిశీలించినప్పటికీ, వాటిలో ఏ ఒక్కటి కూడా స్వతంత్రంగా పనిచేసే ఔషధాన్ని రూపొందించలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. ఒక ఔషధం అభివృద్ధిలో దాని భద్రతా, ప్రభావాలను నిర్ధారించేందుకు ల్యాబ్ టెస్టులు, జంతువులపై ప్రయోగాలు, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు.