NTV Telugu Site icon

Russia: కిమ్-పుతిన్ భేటీ తర్వాత పెరిగిన రైళ్ల రాకపోకలు.. కారణం అదేనా..?

Putin Kim

Putin Kim

Russia: రష్యా-ఉత్తర కొరియాల మధ్య ఏదో పెద్దగానే జరుగుతోంది. ఇటీవల ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, రష్యాలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు దేశాల మధ్య ఆయుధాల డీల్ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కిమ్-పుతిన్ భేటీ తర్వాత రష్యా-ఉత్తర కొరియాల మధ్య రైళ్ల రాకపోకలు పెరిగాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇరు దేశాల మధ్య ట్రైన్ ట్రాఫిక్ పెరిగినట్లు నివేదికలు వెలువడ్డాయి.

అమెరికా హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ ఉత్తర కొరియాలో సరిహద్దు తమగాంగ్ రైల్ ఫెసిలిటీ వద్ద కనీసం 70 పరకు రవాణా రైళ్లు నిలిచి ఉన్నట్లు శుక్రవారం గుర్తించింది. కోవిడ్ ముందుతో పోలిస్తే ప్రస్తుతం అపూర్వమైన పెరుగుదల అని యూఎస్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో 20కి మించి సరకు రవాణా రైళ్లు కనిపించలేదు.

Read Also: Rajasthan CM: బీహార్‌ తరహాలో కులాల సర్వే.. రాజస్థాన్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన

అయితే ఈ రైళ్ల ట్రాఫిక్ నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆయుధాలు సరఫరా అవుతున్నాయనే వాదనల్ని వెలుగులోకి తీసుకువచ్చాయి. అయితే రైళ్లకు టార్పలిన్లు కప్పి ఉంచడంతో వాటిలో ఏముందో కనుక్కోవడం కష్టంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించేందుకు రష్యా, నార్త్ కొరియా నుంచి మందుగుండు సామాగ్రిని కోరింది. బదులుగా కిమ్ క్షిపణి సాంకేతికత, అణు జలాంతర్గామిని కోరినట్లు సమాచారం. రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపుకు నార్త్ కొరియా ఆర్టిలరీ షెల్స్ ని పంపినట్లు అమెరికా ఆరోపించింది.

ఇటీవల పుతిన్-కిమ్ భేటీల ఎలాంటి ఒప్పందాలు కుదరలేదని రష్యా చెబుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య సైనిక సహకారం కనిపిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఇటు రష్యా, అటు నార్త్ కొరియాలపై ప్రపంచం ఆంక్షలు పెట్టింది. దీంతో ఈ రెండు దేశాలు ఇటీవల కాలంలో మరింత దగ్గరయ్యాయి.