Taliban celebrates 1st anniversary of US troops withdrawal: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ సంబారాలు అంబరాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తాలిబాన్ ప్రభుత్వం సంబరాలు చేస్తోంది. ఆగస్టు 31న జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. 20 ఏళ్ల పాటు ఆప్ఘనిస్తాన్ లో ఉన్న యూఎస్ బలగాలు ఉపసంహరించుకుని ఏడాది గడవడంతో తాలిబన్లు మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రంగురంగలు లైట్లతో రాజధాని కాబూల్ మెరిసిపోతోంది.
2021 ఆగస్టులో యఎస్, నాటో బలగాలు ఆప్ఘన్ నుంచి వెళ్లిపోయాయి. దీంతో తాలిబన్లు ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏడాదిగా తాలిబన్ పాలన కొనసాగుతోంది. కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తున్నారు అక్కడి పాలకులు. ప్రపంచంలోని చాలా దేశాలు ఆప్ఘన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. దీంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, తాలిబాన్ అరాచక పాలన, పేదరికంతో ఆఫ్ఘనిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికీ మహిళల విద్య ప్రశ్నార్థకంగానే ఉంది. కాబూల్ నుంచి ఇతర దేశాలకు వెళ్లి చదువుకునేందుకు మహిళలకు పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు.
ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఉన్నా కూడా.. కొంత మంది ఆప్ఘన్ పౌరులు తాలిబాన్ పాలనపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లా మా దేశం నుంచి అవిశ్వాసులను వెళ్లగొట్టారని చెబుతున్నారు. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ పై సెప్టెంబర్ 11,2001 దాడుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో మొదలైన యూఎస్ సైనిక జోక్యం చివరకు 2021లో ముగిసిందని కొంతమంది మతఛాందస వాదులు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు 20 ఏళ్లలో 66,000 మంది ఆఫ్ఘాన్ సైనికులు, 48,000 మంది ప్రజలు, 3500 మంది నాటో సైనికులు మరణించారు.
తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో పేదరికం విపరీతంగా పెరిగింది. పిల్లలను అమ్ముకోవడంతో పాటు.. కిడ్నీలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు అక్కడి ప్రజలు. మరోవైపు ఐసిస్ ఉగ్రసంస్థ వరసగా దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా మైనారిటీలు అయిన షియాలు, హజారా తెగలకు సంబంధించిన ప్రజలనే టార్గెట్ చేస్తోంది. మసీదుల్లో బాంబులు పెడుతూ.. ఆత్మాహుతి దాడులకు తెగబడుతోంది. ఏడాది కాలంలో పదికిపైగా మేజర్ ఉగ్రవాద దాడులకు తెగబడింది ఐసిస్
