Site icon NTV Telugu

ఆప్ఘనిస్తాన్ సంక్షోభం… పెరిగిన ధరలు

ఢిల్లీలోని డ్రై ఫ్రూట్స్ మార్కెట్ చాలా ప్రసిధ్ది. దేశంలోని నలుమూలలకు ఢిల్లీ నుంచే డ్రై ఫ్రూట్స్ సరఫరా అవుతాయి. ఆప్ఖనిస్తాన్ తో భారత్ దేశం సుమారు ( 400 మిలియన్ అమెరికన్ డాలర్లు) 4 వేలకోట్ల రూపాయల మేరకు డ్రై ఫ్రూట్స్ బిజినెస్ నిర్వహిస్తుంది. ఆప్ఘనిస్తాన్ కు భారత్ ఓ పెద్ద మార్కెట్. పాత ఢిల్లీలోని, జమా మసీదు సమీపంలో “ఖారీ బావ్లీ” ప్రాంతంలో ఉన్న డ్రై ఫ్రూట్స్ హోల్ సేల్, రిటైల్ మార్కెట్లు వెలవెలబోతున్నాయు. ఆప్ఘనిస్తాన్ రైతుల నుంచి నేరుగా డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాల ను భారత్ హోల్ సేల్ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. అయితే, ప్రస్తుతం తాలిబాన్ల అధీనంలో ఉన్న ఆప్ఘనిస్తాన్ లో అనిశ్చిత స్థితి ఎప్పుడు మెరుగుపడుతుందా అనే ఆందోళనలో హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు ఉన్నారు.

భారత్ దిగుమతి చేసుకునే అంజీరా, బాదం, కిస్మిస్, నల్ల ఎండు ద్రాక్ష లాంటి డ్రై ఫ్రూట్స్ లో మొత్తం 99 శాతం ఆప్ఘనిస్తాన్ నుంచే దిగుమతి జరుగుతుంది. జీలకర్ర, ఇంగువ లాంటి సుగంధ ద్రవ్యాలు కూడా ఎక్కువ భాగం ఆప్ఘనిస్తాన్ నుంచే భారత్ దిగుమతి చేసుకుంటుంది. భారత్ లో సుమారు 40 శాతం మంది డ్రై ఫ్రూట్స్ ను వినియోగం చేస్తారు. డ్రై ఫ్రూట్స్ ను పండించే ఆప్ఘనిస్తాన్, ఇరాన్, మధ్య ప్రాచ్య దేశాలలో గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా నీటి ఎద్దడి రావడంతో కొంత మేరకు డ్రై ఫ్రూట్స్ దిగుబడి తగ్గిపోయుంది. దీనికి తోడు, పాశ్చాత్య దేశాలలో డ్రై ఫ్రూట్స్ వాడకం బాగా పెరగడంతో, ధరలు బాగా పెరిగిపోయాయు. అలాగే, ఆప్ఘనిస్తాన్ లో నెలకున్న ప్రస్తుత సంక్షోభం తోడుకావడంతో, డ్రై ఫ్రూట్స్ ధరలు మరింతగా పెరిగాయి. ప్రస్తుత పరిస్థితి ని ఆసరా చేసుకుని, ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలలో ఉన్న సరుకు ను హోల్ సేల్ వ్యాపారులు 15 నుంచి 30 శాతం ధరలను పెంచి అదనపు లాభాలు ఆర్జించే ప్రయత్నం చేస్తున్నారు.

ధరలు పెరగడంతో వినియోగదారులు కొనేందుకు తటపటాయుస్తున్నారని రిటైల్ వ్యాపారులు వాపోతున్నారు. “ఇండో-ఆప్ఘన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్” మాత్రం, ఆప్ఘన్ వ్యాపారులు దుకాణాలు మూసివేయడం, స్థానిక ఆప్ఘన్ అధికారులు విధుల్లోకి రాకపోవడం లాంటి కారణాల వల్ల సరుకు రవాణా లో కొంత అవాంతరాలు ఉన్నాయే కానీ, తాలిబన్లు భారత్ దిగుమతుల పై ఏ లాంటి ఆంక్షలు విధించలేదని చెపుతున్నారు. త్వరలోనే భారత్ కు డ్రై ఫ్రూట్స్ దిగుమతులు ప్రారంభం కాబోతున్నాయని, ఏలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని “ఇండో-ఆప్ఘన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్” ప్రతినిధులు చెప్తున్నారు. ఏదైనా, వచ్చే వారం లో పెరిగిన ధరలు మరలా తగ్గుముఖంపట్టవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయుతే, వచ్చే దీపావళి కి ధరలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం అని అంటున్నారు ఢిల్లీ వ్యాపారులు. డ్రై ఫ్రూట్స్ పంట ఉత్పత్తి వ్యయం కూడా బాగా పెరగడం కూడా ఓ ప్రధాన కారణం అంటున్నారు. ఇక, భారత్ లో కూడా “కోవిడ్” కారణంగా వినియోగదారులు కొనుగోలు శక్తి కొంతమేరకు కోల్పోయారని, ఈ పరిణామాలు కూడా డ్రై ఫ్రూట్స్ మార్కెట్లను దెబ్బతీశాయని స్థానిక వ్యాపారులు అంటున్నారు. ఢిల్లీలోని డ్రై ఫ్రూట్స్ వ్యాపారులు మాత్రం కొంత ఆందోళనలోనే ఉన్నారు. అంతా ఆప్ఘనిస్తాన్ వైపే చూస్తున్నారు.

Exit mobile version