Site icon NTV Telugu

Israel: తెగిన తలను అతికించారు.. ఇజ్రాయెల్‌ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స

Israel

Israel

Israel: తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ఇస్తారని అంటారు. అది ఇజ్రాయిల్‌లోని ఒక బాలుని విషయంలో నిజమైంది. కారు ప్రమాదంలో తెగిన తలను అతికించి.. బ్రతకడు అనుకున్న 12 ఏళ్ల బాలున్ని వైద్యులు అత్యంత కఠినతరమైన ఆపరేషన్‌ను చేసి.. బ్రతికించారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. వైద్యశాస్త్ర చరిత్రలో ఇదో అరుదైన ఘటన అని.. అసాధ్యమని భావిస్తున్న ఓ చికిత్సా విధానాన్ని ఇజ్రాయెల్‌ వైద్యులు తమ హస్తవాసి ద్వారా సుసాధ్యం చేసి చూపించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యు ఒడికి చేరువలో ఉన్న ఓ చిన్నారికి…ఆధునిక సాంకేతికతకు తమ నైపుణ్యాన్ని మేళవించి పునర్జన్మ ప్రసాదించారు. శరీరం నుంచి అంతర్గతంగా విడిపోయిన శిరస్సును అతికించి ప్రాణాలు కాపాడారు.

Read also: Amanchi Srinivasa Rao: జనసేనలోకి ఆమంచి సోదరుడు.. నేడు పవన్‌ సమక్షంలో చేరిక

జోర్డాన్‌ వ్యాలీకి చెందిన పన్నెండేళ్ల సులేమాన్‌ హసన్‌కు సైకిల్‌ రైడ్‌ ఎంతో ఇష్టం. రోజూ పాఠశాల నుంచి ఇంటికి రాగానే తప్పనిసరిగా తన సైకిల్‌పై వ్యాలీలోని రోడ్లపై చక్కర్లు కొట్టాల్సిందే. బిజీగా ఉండే ఆ రహదారులపై జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులు అతడిని తరచూ హెచ్చరించేవారు. ఓ రోజు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లిన హసన్‌ను కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతనిని ఆస్పత్రికి తరలించారు. హసన్‌ కేసును జెరూసలేంలోని హదస్సా ఈన్‌ కెరెమ్‌ ఆస్పత్రి వైద్యులు ఓ సవాలుగా స్వీకరించారు. ప్రమాదంలో హసన్‌ మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దాంతో పాటు పొత్తి కడుపులో బలమైన గాయమైనట్లు గుర్తించారు. తల, శరీరం దాదాపు ఒకదాన్నుంచి మరోటి వేరైన స్థితిలో హసన్‌ను తీసుకొచ్చినట్లు ఆస్పత్రి ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డా.ఓహాద్‌ ఈనావ్‌ తెలిపారు. శిరస్సుతో వెన్నెముక చివరి అంచును కలిపి ఉంచే భాగం దాదాపు విడిపోయింది. ‘‘మేమంతా హసన్‌ పరిస్థితి చూసి నివ్వెరపోయాం. తల, మెడ కలిసే చోటులోని లిగ్మెంట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వెంటనే సమీక్ష నిర్వహించి ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించాం. శస్త్రచికిత్స ద్వారా హసన్‌ తల, వెన్నెముకను తిరిగి కలిపాం. ఇది ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. ఆస్పత్రిలోని అన్ని విభాగాల స్పెషలిస్ట్‌ వైద్యులు కొన్ని గంటలపాటు శ్రమించారు. ఆపరేషన్‌ సమయంలో వైద్యుల సాంకేతిక అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రామా సిబ్బంది సత్వరం స్పందించి ప్రాథమిక చికిత్స అందించడం నుంచి.. ఆపరేషన్‌ చేయడం వరకూ ప్రతి నిర్ణయం హసన్‌ ప్రాణాల్ని నిలబెట్టేందుకు తోడ్పడింది. మా ప్రయత్నం వృథా కాలేదు. ఆపరేషన్‌ విజయవంతమైంది’’ అని డా.ఓహాద్‌ ఈనావ్‌ తెలిపారు.

Read also: Bombay High Court: కొత్త ఐటీ చట్టాలపై బాంబే హైకోర్టు సీరియస్‌.. విపరీతంగా ఉన్నాయంటూ వ్యాఖ్యలు

హసన్‌కు గత నెలలో శస్త్రచికిత్స చేయగా.. ప్రస్తుతం పరిస్థితి మెరుగవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఆపరేషన్‌ తర్వాత నెలరోజుల పాటు హసన్‌ను ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు అనుక్షణం గమనిస్తూ కంటికి రెప్పలా కాపాడారు. బతకడనుకున్న తమ కుమారుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులకు చెమ్మ గిల్లిన కళ్లతో హసన్‌ తండ్రి ధన్యవాదాలు చెప్పారు. ‘‘మా ఒక్కగానొక్క బిడ్డను తిరిగి ప్రాణాలతో తమకు అప్పగించిన వైద్యులకు నేను జీవితాంతం రుణపడి ఉంటా…. ప్రమాదం జరిగిన తర్వాత బతికే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. అపార అనుభవం కలిగిన వైద్య సిబ్బంది, సాంకేతికత, సత్వర నిర్ణయం, ట్రామా, ఆర్థోపెడిక్‌ బృందాలే మా అబ్బాయిని కాపాడాయని.. అందదుకు తాను వారికి పెద్ద థ్యాంక్స్‌ చెప్పడం మినహా ఏమీ చేయలేనని హసన్‌ తండ్రి చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు.

Exit mobile version