స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. వరదలు కారణంగా ఇప్పటి వరకు 51 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురి ఆచూకీ ఇంకా తెలియలేదు అని అధికారులు తెలిపారు. మరోవైపు వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
స్పెయిన్‌లోని వాలెన్సియాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. హఠాత్తుగా వచ్చిన వరదలతో జనజీవనం అస్తవ్యస్థం అయింది. పలు కుటుంబాల్లో ఆప్తులను కోల్పోయి దు:ఖంలో ఉన్నారు. చాలా మంది వరదలో కొట్టుకుపోయారు. రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీస్తున్నారని ప్రభుత్వ అధికారి కార్లోస్ మజోన్ పేర్కొన్నారు. మరోవైపు దక్షిణ స్పెయిన్‌లోనూ భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో అక్కడి వీధులు బురద నీటితో నిండిపోయాయి. వరదల కారణంగా పలువురు తప్పిపోయినట్లు అధికార ప్రతినిధి పేర్కొన్నారు. తప్పిపోయిన కోసం డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
వాలెన్సియా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ సేవలు కూడా నిలిచిపోయాయి. విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొన్ని చోట్ల వరదలు ముంచెత్తడంతో రోడ్లు తెగిపోయాయని ప్రాంతీయ చీఫ్ కార్లోస్ మజోన్ విలేకరులతో అన్నారు. మొత్తానికి ఆకస్మిక వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్ర వాతావరణ సంస్థ వాలెన్సియా ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో సిటీ హాల్ అన్ని పాఠశాల తరగతులు, క్రీడా కార్యక్రమాలను నిలిపివేసినట్లు వెల్లడించింది. 12 విమానాలను దారి మళ్లించగా.. 10 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా రైళ్ల రాకపోకలను సైతం నిలిపివేశారు. మృతుల కుటుంబాలకు స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సంతాపం వ్యక్తం చేశారు. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు.