Trump Tariffs India: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుండటంతో భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అగ్రరాజ్యం అమెరికా విధించిన అదనపు సుంకాలు ఆ దేశ కాలమానం ప్రకారం.. ఇవాళ (ఆగస్టు 27న) తెల్లవారుజామున 12.01 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలు) నుంచి కొత్త టారీఫ్స్ అమల్లోకి రానున్నాయి. గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి ఇండియన్ ఎగుమతులపై మొత్తం 50 శాతం భారం పడనుంది. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపించనుంది. టారీఫ్స్ అమలుపై అమెరికా హోంలాండ్ భద్రతా విభాగం సోమవారం నాడు ముసాయిదా ఉత్తర్వులను విడుదల చేసింది.
Read Also: Mohammed Siraj: బుమ్రా జట్టులో లేనప్పుడే బాగా ఆడతా!
కాగా, బుధవారం తెల్లవారుజామున 12.01 గంటల్లోగా ఓడల్లో లోడ్ చేసిన ఉత్పత్తులకు, రవాణాలో ఉన్న వాటికి మాత్రం అదనపు సుంకాలు వర్తించవు అని ముసాయిదాలో పేర్కొనింది. వాటిని సెప్టెంబరు 17వ తేదీ తెల్లవారుజామున 12.01 గంటల్లోగా వినియోగిస్తున్నట్లుగా, గోదాముల నుంచి బయటకు వచ్చినట్లుగా యూఎస్ పరిగణించనుంది. వీటికి ప్రత్యేక కోడ్‌ను కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు, భారత్, బ్రెజిల్‌లపైనే అమెరికా అత్యధికంగా 50 శాతం టారీఫ్స్ విధించింది. వాణిజ్యశాఖ లెక్కల ప్రకారం.. యూఎస్ అదనపు సుంకాల వల్ల 48.2 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఎఫెక్ట్ పడనుంది. మన దేశంపై అదనపు భారంతో అమెరికాకు ఎగుమతుల్లో మనతో పోటీపడే దేశాలకు మరింత ప్రయోజనం కలగనుంది.
