Burkina Faso: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో దారుణం జరిగింది. జీహాదీలు జరిపిన దాడిలో 40 మంది మరణించారు. 33 మంది గాయపడ్డారు. శనివారం సాయంత్ర 4 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని ఉగ్రవాదులు సైనికులు, వాలింటరీలు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఉత్తర బుర్కినాఫాసోలోని ఓరేమా అనే గ్రామంలో ఈ దాడి జరిగింది. మృతుల్లో 8 మంది సైనికులు ఉండగా.. 32 మంది డిఫెన్స్ వాలంటీర్లు ఉన్నట్లు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సైన్యం జరిపిన వైమానికి దాడిలో 50 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపింది.
ఆదివారం సైన్యంపై మరోదాడి జరిగింది. బామ్ ప్రావిన్స్ నార్త్ సెంట్రల్ రీజియన్ లో ఈ దాడి జరింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మరణించగా.. 20 మంది ఉగ్రవాదులను హతమార్చింది సైన్యం. ప్రస్తుతం మొదటి దాడిలో గాయపడినవారి పరిస్థితి నిలకడగా ఉందని అక్కడి అధికారులు తెలిపారు. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా పనిచేస్తున్న జీహాదీలు ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది.
గత వారం నైజర్ సరిహద్దుకు సమీపంలోని ఈశాన్య ప్రాంతంలోని రెండు గ్రామాలపై దాడులు చేసిన తీవ్రవాదులు 44 మంది పౌరులను చంపేశారు. గత సెప్టెంబర్ లో కెప్టెన్ ఇబ్రహీం ట్రార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పౌరులపై ఉగ్రవాదులు దారుణమైన దాడులు చేస్తున్నారు. ఫిబ్రవరిలో దేశ ఉత్తర భాగంలో ఉన్న డియోలో 51 మంది సైనికులు మరణించారు. ఆఫ్రికాలో అత్యంత పేదదేశాల్లో బుర్కినా ఫాసో ఒకటిగా ఉంది. ప్రస్తుతం దేశ ఉత్తరభాగంలోని 40 శాతం ఉగ్రవాదుల ఆధీనంలో ఉంది. ప్రస్తుతం అధ్యక్షుడు ట్రారే ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకోనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. దేశంలో హింసాకాండ కారనంగా 10,000 మందికి పైగా మరణించారు. రెండు మిలియన్ల మంది ప్రజలు ఇళ్లను విడిచిపెట్టారు.