Israel: పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై మెరుపుదాడి చేశారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లతో ఇజ్రాయిల్ భూభాగాలపై దాడులు నిర్వహించారు. సరిహద్దుల్లోనే పట్టణాలను టార్గెట్ చేస్తూ దాడులు జరిగాయి. గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగాల్లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు సాధారణ పౌరులను పిట్టల్లా కాల్చారు.
ఇప్పటి వరకు ఈ దాడుల్లో 40 మంది మరణించగా.. 500 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ రెస్క్యూ సర్వీస్ తెలిపింది. హమాస్ ఉగ్రవాదులు ‘‘ ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్’’పేరుతో ఆపరేషన్ నిర్వహించినట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే దీని ప్రతిగా ఇజ్రాయిల్ ‘ఆపరేషన్ ఐరన్ స్వార్డ్’ పేరుతో హమాస్ ని టార్గెట్ చేస్తోంది. గాజాలోని మిలిటెంట్ల స్థావరాలు, వారికి సహకరిస్తున్న వారిపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. పాలస్తీనాలో 161 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ తెలిపింది.
Read Also: GST: చెక్కర రైతులకు తీపి కబురు చెప్పిన నిర్మలా సీతారామన్.. వీటిపై జీఎస్టీ తగ్గింపు..
ఇది ఆపరేషన్ కాదని, తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయిల్ ప్రజలను ఉద్దేశించి ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ అన్నారు. ఈ యుద్ధంతో ఇజ్రాయిల్ గెలుస్తుందని, హమాస్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు హమాస్ తీవ్రవాద నాయకుడు మహ్మద్ దీఫ్ ఓ వీడియోలో మాట్లాడుతూ.. జవాబుదారీతనం లేని నిర్లక్ష్యపు కాలం ముగిసిపోయిందని శత్రువులు అర్థం చేసుకునేలా భగవంతుడి సాయంతో వీటిన్నింటికి ముగింపు పలకాలని అన్నాడు.
2007లో గాజాలో హమాస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య అనేక దాడులు జరిగాయి. ఇజ్రాయిల్ గజాన్ వర్కర్లకు సరిహద్దును మూసేసిన తర్వాత ఇరు పక్షాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో 247 మంది పాలస్తీనియన్లు, 32 మంది ఇజ్రాయిలీలు, ఇద్దరు విదేశీ వ్యక్తులు మరణించారు. తాజా దాడిలో గాజా స్ట్రిప్, ఇజ్రాయిల్ సరిహద్దుల్లోని పట్టణాలు, నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
