NTV Telugu Site icon

Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 350 మంది తెలుగు విద్యార్థులు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న వేళ భారతీయులు ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్‌లో మన భారతీయులు ఎంతో మంది చిక్కుకున్నారు. వారిలో 350 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఇటీవల భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిరిండియా విమానం వెళ్లగా.. ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్ మూసేయడంతో విమానం ఖాళీగా తిరిగొచ్చేసింది. దీంతో తమ వాళ్ల సమాచారం తెలియకపోవడంతో ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. తమ పిల్లలను ఎలాగైనా స్వదేశానికి ర‌ప్పించాల‌ని వారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరుతున్నారు.

మరోవైపు ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ అధికారులను సంప్రదించి విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని తాము కూడా కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రక‌ట‌న చేసింది. దీంతో సంబంధిత అధికారులు ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థుల చిరునామాల‌ను సేక‌రిస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం తెలంగాణ ఎన్నారై సెల్ అధికారులకు వారు ఫోన్ చేసి సమాచారాన్ని కోరారు. ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 350 మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని విదేశీ వ్యవ‌హారాల శాఖ కూడా వెల్లడించింది.