Site icon NTV Telugu

Pakistan: పాకిస్తాన్‌లో భయం భయం.. వర్సిటీల మూసివేత..

Pakistan

Pakistan

Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ భయంతో వణికిపోతోంది. ఇటీవల ఇరాన్ పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌పై దాడులు చేసింది, దీనికి ప్రతిగా పాకిస్తాన్ కూడా ఇరాన్‌పై వైమానిక దాడులు చేసింది. దీని తర్వాత ఇరాన్ పెద్ద ఎత్తున మిలిటరీ విన్యాసాలు చేయడంతో పాటు పాక్ సరిహద్దు వైపు కదులుతుందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్‌లో అంతర్గతంగా రాజకీయ, ఆర్థిక, భద్రతా సంక్షోభాలతో సతమతమవుతోంది.

Read Also: Ram Mandir: రామ మందిరం తెరుచుకోగానే ‘ముహూర్తం డెలివరీ’.. మగబిడ్డ జననం..

ఇన్ని సమస్యల మద్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భద్రతా పరమైన బెదిరింపుల కారణంగా పాక్ సైన్యానికి అనుబంధంగా ఉన్న మూడు యూనివర్సిటీలను సోమవారం అక్కడి పోలీసులు మూసేశారు. మరో రెండు వారాల్లో పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. పోలీసులు, సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం భయపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లోని నేషనల్ డిఫెన్స్ యూనివర్శిటీ, బహ్రియా యూనివర్శిటీ మరియు ఎయిర్ యూనివర్శిటీలను మూసేశారు. ఈ కాలేజీలకు పాక్ సైన్యం, నౌకాదళం, వైమానిక దళంతో సంబంధాలు ఉన్నాయి.

పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల కాలంలో పాక్ తాలిబాన్లు అక్కడి సైన్యం, పోలీసులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తున్నారు. మరోవైపు బలూచ్ లిబరేషన్ సంస్థలు, పాకిస్తాన్‌కి సవాల్ విసురుతున్నాయి. తాజాగా ఇరాన్ దాడులు పాకిస్తాన్‌ని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఏ క్షణానికి ఏం జరుగుతుందో అని భయపడుతోంది.

Exit mobile version