రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ప్రారంభమై మూడు నెలలు గడిచాయి. ఇప్పటికే ఈ రెండు దేశాలు తగ్గడం లేదు. రష్యా దాడిలో ఉక్రెయిన్ పట్టణాలు, నగరాలు, గ్రామాలు ధ్వంసం అవుతున్నాయి. అయినా ఇప్పట్లో యుద్ధానికి ఫుల్ స్టాప్ పడటం లేదు. ఉక్రెయిన్ లో 20 శాతం ప్రస్తుతం రష్యా ఆధీనంలోకి వెళ్లిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలైన డాన్ బాస్, లుహాన్స్క్ ప్రాంతాలపై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి.
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలు, పట్టణాలు మసిదిబ్బలుగా మారాయి. ఇప్పకే దేశ రాజధాని కీవ్ తో సహా, ఖార్కీవ్, మరియోపోల్, సుమీ, ఎల్వీవ్ వంటి నగరాలు రష్యా దాడులకు దెబ్బతిన్నాయి. దీంతో పాటు చాలా వరకు ఉక్రెయిన్ భూభాగం గన్నులు, సైనిక వాహనాలతో నిండిపోయింది.
ఆస్తినష్టంతో పాటు భారీగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం నివేదిక ప్రకారం ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి24 నుంచి ఇప్పటి వరకు 287 మంది పిల్లలు మరణించారు. 492 మందికి పైగా చిన్నారులు గాయపడ్డారు. రష్యా దళాలు విచక్షణారహితంగా జరిగిన షెల్లింగ్స్ వల్ల ఒక్క మరియోపోల్ నగరంలోనే 24 మంది పిల్లలు మరణించారు. ముఖ్యంగా మరియోపోల్ నగరంలో విధ్వంసం చాలా జరిగింది. నగరం పూర్తిగా దెబ్బతింది. మురుగునీటి వ్యవస్థ శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు యుద్ధంలో మరణించిన వారి శవాలు వీధుల్లో కళ్లిపోతున్నాయని నగర మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 5 మిలియన్ల మంది ప్రజలపై యుద్ధ ప్రభావం పడింది.