Suicide Bombing: టర్కీ రాజధాని అంకారా నడిబొడ్డున ఆత్మాహుతి దాడి జరిగింది. పార్లమెంట్ భవనం వెలుపల, మంత్రిత్వ శాఖ భవనాలకు ముందు ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మహుతి బాంబు దాడికి పాల్పడ్డారని టర్కీ అంతర్గత మంత్రి ఆదివారం చెప్పారు. వేసవి విరామం తర్వాత పార్లమెంట్ తిరిగి తెరవడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగింది.
Read Also: Pakistan: పాక్‌లో మరో ఉగ్రవాది ఖతం.. ముంబై దాడుల సూత్రధారి సన్నిహితుడి కాల్చివేత..
ఉగ్రవాదుల్లో ఒకరు పేలుడులో మరణించగా.. మరొకరిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఈ దాడిలో ఇద్దరు పోలీస్ అధికారులు స్వల్పంగా గాయపడ్డారు. పార్లమెంట్, మంత్రిత్వ కార్యాలయ భవనాల ముందు పేలుడు వినిపించిందని టర్కీష్ మీడియా వెల్లడించింది. ఓ వాహనంలో ఉగ్రవాదులు ఘటనా స్థలానికి చేరుకున్నారని టర్కీ అంతర్గత మంత్రి యర్లికాయ తెలిపారు.
ఈ దాడి తర్వాత టర్కీ గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోని ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ విస్తృతంగా తనిఖీ చేస్తోంది. సిటీ సెంటర్ లోకి వెళ్లే అన్ని దారుల్ని పోలీసులు చుట్టుముట్టారు. అయితే ఉగ్రవాదులు ఏ ఉగ్రసంస్థకు చెందిన వారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై టర్కీష్ అధికారులు విచారణ జరుపుతున్నారు.