Earthquake: పసిఫిక్ మహాసముద్రంలోని ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’లో అసలేం జరుగుతోంది. కేవలం 7 రోజుల్లో 187 భూకంపాలు సంభవించడం శాస్త్రవేత్తల్ని ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం జపాన్, ఇండోనేషియా, అలస్కా, అమెరికాలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు నమోదయ్యాయి. 4.5 తీవ్రత లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న 187 భూకంపాలు వచ్చాయి. వీటిలో ఇండోనేషియాలో సంభవించిన 7.7 తీవ్రత భూకంపం అతిపెద్దది.
రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటి..?
రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న 40,000 కిలోమీటర్ల ప్రాంతం. ఈ ప్రాంతంలో భూఅంతర్భాగంలో అనేక ‘‘టెక్టానిక్ ప్లేట్ల’’ కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫలకాలు నిరంతరం కదలికలు, ఒత్తిడికి గురవుతుంటాయి. దీంతోనే భూకంపాలు, సునామీ, అగ్ని పర్వతాల పేలుళ్లు సంభవిస్తుంటాయి. ప్రపంచంలోని 90 శాతం భూకంపాలు ఈ ప్రాంతం చుట్టూనే జరుగుతాయి.
గత వారంలో సంభవించిన అతిపెద్ద భూకంపం ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో సంభవించింది. దీని తర్వాత ఉత్తర ఇండోనేషియాలో 6.9 తీవ్రతతో, దక్షిణ పెరూలో 6.7 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. జపాన్, అలాస్కా, పశ్చిమ యునైటెడ్ స్టేట్స్‌లో కూడా 4.5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత గల అనేక భూకంపాలు సంభవించాయి. ఒక పెద్ద భూకంపం తర్వాత చిన్న ప్రకంపనలు రావడం సాధారణం. వీటిని ఆఫ్టర్ షాక్‌లు అంటారు.
ప్రమాదమా..?
కేవలం భూకంపాల సంఖ్య ఆధారంగా సైంటిస్టులు పెద్ద ప్రళయం రాబోతోందని ఖచ్చితంగా చెప్పలేరు. భూకంపాలు ఖచ్చితమైన తేదీ, తీవ్రతను అంచనా వేయలేరు. కాలిఫోర్నియా, టర్కీ ప్రాంతాలు చురుకైన భూకంప మండలాల్లో ఉండటం వల్ల అవి ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నాయని చెబుతున్నారు. ఇలా వరసగా భూకంపాలు పెద్ద భూకంపాలనికి కారణమయ్యే శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ ఇలా వరస భూకంపాలు మాత్రం అందర్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.

