Site icon NTV Telugu

Iran Protests: ఇరాన్‌లో నరమేధం.. ఎటుచూసినా శవాలే.. 12 వేల మంది చనిపోయినట్లుగా అంతర్జాతీయ కథనాలు!

Iran Protests

Iran Protests

ఇరాన్‌లో నరమేధం జరిగినట్లుగా అంతర్జాతీయ కథనాల్లో వెలువడుతున్నాయి. టెహ్రాన్‌లో ఎటుచూసినా నగర వీధుల్లో శవాలు పడి ఉన్నట్లుగా కథనాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా వేలాది మంది గాయాలు పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం.

ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండు వారాలకు పైగా ఇరాన్‌లో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 2 వేల మంది వరకు చనిపోయినట్లుగా అధికారిక సమాచారం అయినా.. ఆ సంఖ్య 12 వేల మంది వరకు ఉంటుందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అంటే ఆందోళనలు అణిచివేసేందుకు భద్రతా దళాలు ఊచకోతకు తెగబడినట్లుగా సమాచారం. దీంతో ఎటుచూసినా శవాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇరాన్‌కు చెందిన ఒక వెబ్‌సైట్‌లో 10 వేల మంది చనిపోయినట్లుగా సంచలన కథనంలో పేర్కొంది. ఈ హత్యలపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

కనీవినీ ఎరుగని రీతిలో ఇరాన్‌లో హింస చోటుచేసుకుందని ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ కథనం తెలిపింది. తాజాగా జరిగిన అల్లర్లలో 12 వేల మంది చనిపోయినట్లుగా పేర్కొంది. పౌరులతో పాటు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ప్రత్యక్ష సాక్షులు, వైద్య బృందం, తదితర వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఈ అంచనా వేసినట్లుగా స్పష్టం చేసింది. జనవరి 8, 9 తేదీల్లో ఈ మరణాలు సంభవించాయని తెలిపింది. ఇరాన్ చరిత్రలో ఇలాంటి హింస ఎప్పుడూ జరగలేదని కథనంలో వెల్లడించింది. ఇక అరెస్టైన వారిలో కూడా చాలా మంది మరణశిక్ష కూడా పడొచ్చని స్పష్టం చేసింది.

గత కొద్దిరోజులుగా ద్రవ్యోల్బణం కారణంగా ఇరానీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస వసతులు లేక నరక యాతన పడుతున్నారు. దీంతో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే పెద్ద ఎత్తున మహిళలు రోడ్లపైకి వచ్చి ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలపై అణిచివేత కారణంగానే ఇంత పెద్ద ఎత్తున మహిళలు రోడ్లపైకి వచ్చినట్లు తెలుస్తోంది. నియంతకు మరణశిక్ష విధించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అంటే ఖమేనీపై ఏ రేంజ్‌లో కోపం ఉందో దీనిని బట్టి అర్థమవుతోంది.

ఇంకో వైపు నిరసనలు కారణంగా ఇరాన్ అంతటా అంధకారం అలుముకుంది. ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. నిత్యావసర వస్తువులు దొరకడం లేదు. నగదు కొరత ఏర్పడింది. అన్ని రకాలుగా ప్రజా రవాణా ఆగిపోయింది. అన్ని నగరాల్లో ఆందోళనలు ఉధృతం కావడంతో భద్రతా దళాలు కూడా చేతులెత్తేశాయి. ఇంకోవైపు అయతుల్లా ఖమేనీ ప్రభుత్వం కూడా చేతులెత్తేసినట్లుగా సమాచారం. దీంతో ఆయన పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సహచరులు, కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు వెళ్లిపోయేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version