Site icon NTV Telugu

Pakistan: పాకిస్తాన్‌లో కుప్పకూలిన బొగ్గు గని.. 12 మంది దుర్మరణం..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్‌లో బొగ్గు గని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది కార్మికులు చనిపోయారు. దక్షిణ పాకిస్తాన్ ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలిపోయిన బొగ్గు గని నుంచి బుధవారం మరో 10 మంది మైనర్ల మృ‌తదేహాలను బయటకు తీశారు. రెస్క్యూ ముగిసిన తర్వాత మొత్తం మృతుల సంఖ్య 12గా తేలిందని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఖోస్ట్ మైనింగ్ ప్రాంతంలో ప్రైవేట్ బోగ్గు గనిలో గ్యాస్ పేలుడు సంభవించింది. దీంతో పలువురు కార్మికులు భూమి అడుగున 800 అడుగుల కింద చిక్కుకుపోయారు.

Read Also: Sree Vishnu: ‘ఓం భీమ్ బుష్’ పాయింట్ ని ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయలేదు: హీరో శ్రీవిష్ణు

మొత్తం 12 మంది మృతదేహాలను వెలికితీయడంలో సహాయక చర్యలు ముగిశాయని బలూచిస్తాన్ ప్రావిన్స్ మైన్స్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ ఘనీ బలోచ్ చెప్పారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. మిథేన్ వాయువు కారణంగా ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. గని ప్రమాదంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

పాకిస్తాన్‌లో పెద్ద ప్రావిన్సు అయిన బలూచిస్తాన్ అత్యంత వెనకబడిన ప్రాంతం. జనాభా కూడా చాలా తక్కువ. అయితే ఈ ప్రాంతం విలువైన ఖనిజ నిల్వలకు కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో గని నిర్వహణకు సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో తరుచుగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. మే 2018లో, అదే ప్రాంతంలోని రెండు పొరుగు బొగ్గు గనులలో గ్యాస్ పేలుళ్ల కారణంగా 23 మంది మరణించారు మరియు 11 మంది గాయపడ్డారు. 2011లో మరో బలూచిస్థాన్ కొలీరీలో గ్యాస్ పేలుళ్ల కారణంగా గని కూలిపోవడంతో 43 మంది మరణించారు.

Exit mobile version