Site icon NTV Telugu

Covid-19: భారత్‌తో సహా చైనాపై 10 దేశాల ఆంక్షలు

Covid 19

Covid 19

10 nations on alert for China arrivals, demand negative Covid report: చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. అయితే ఈ సంఖ్యను చెప్పడానికి కూడా అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. రోజుకు దేశవ్యాప్తంగా లక్షల కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా బీజింగ్, షాంఘై నగరాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చైనా తన ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడంతో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. జనవరిలో ఈ కేసుల సంఖ్య ఆల్ టైం గరిష్టానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం రానున్న రోజుల్లో చైనాలో 60 శాతం మంది కోవిడ్ బారిన పడతారని అంచనా వేస్తున్నారు. అత్యంత వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కారణంగా అక్కడ లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే చైనా కోవిడ్ పరిణామాల నేపథ్యంలో పలు దేశాలు చైనాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 10 దేశాలు చైనాపై ఆంక్షలు విధించాయి.

Read Also: Bairi Naresh: బైరి నరేష్ అరెస్ట్..

ఇండియాతో పాటు యూఎస్ఏ, యూకే, ఇటలీ, స్పెయిన్, మలేషియా, సౌత్ కొరియా, ఇజ్రాయిల్, జపాన్, ఫ్రాన్స్ దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ నుండి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కోవిడ్ నెగిటెవ్ టెస్ట్ రిపోర్ట్ ఉండాలని సూచించింది. ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు లక్షణాలు కనిపిస్తే లేదా పాజిటివ్ అని తేలితే వారిని క్వారంటైన్ చేస్తోంది.

ఇదే మాదిరి ఇతర దేశాలు కూడా ఆంక్షలు విధిస్తున్నాయి. అమెరికా జనవరి 5 నుంచి చైనా నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ పరీక్ష రిపోర్టు ఇవ్వాలని సూచించింది. చైనా, హాంకాంగ్, మకావు నుంచి బయలుదేరే 2 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న ప్రయాణికులు, తమ ప్రయాణానికి రెండు రోజుల ముందు కరోనా నెగిటివ్ రిపోర్ట్ అవసరం. కోవిడ్ దృష్ట్యా చైనా, హాంకాంగ్ వెళ్లే తమ పౌరులు మరోసారి ఆలోచించాలని కోరింది.

Exit mobile version